అమెరికాలో కేటీఆర్ నగరబాట!

అమెరికాలో కేటీఆర్ నగరబాట! - Sakshi


కార్మెల్, ఇండియానా పోలిస్‌లలో పర్యటన

ఇరు నగరాల మేయర్లతో సమావేశం

పురపాలనలో నూతన పద్ధతులపై ఆరా


 

 

సాక్షి, హైదరాబాద్: అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ఇండియానా రాష్ట్రంలోని కార్మెల్, ఇండియానాపోలిస్ నగరాలను సందర్శించారు. పురపాలనలో అక్కడ అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేశారు. ఈ రెండు నగరాల మేయర్లతో సమావేశమై తాగునీరు, విద్యుత్ సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థ, మురికినీటి శుద్ధి రంగాల్లో అమలు చేస్తున్న అధునాతన పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సమీకరణ కోసం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆసక్తి ప్రదర్శించారు. ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో మౌలిక వసతుల అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులపై ఆరా తీశారు. పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి ఈ రెండు నగరాలకు వస్తున్న ఆదాయ వివరాల గురించి తెలుసుకున్నారు. స్థానిక సంస్థగా నగర ప్రజల నుంచి వచ్చే పన్నులు, ఇతర ఆదాయం మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆదాయానికి మించి బడ్జెట్  కేటాయింపునకు వీలు లేదని కార్మెల్ నగర మేయర్ జేమ్స్ బ్రయనార్డ్ కేటీఆర్‌కు తెలిపారు.



ప్రజలు పన్నులు సకాలంలో చెల్లిస్తారని, పన్నుల ఎగవేత ఏమాత్రం ఉండదన్నారు. నగరాభివృద్ధిలో ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్మెల్ నగరంలో పౌర సేవల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు అమలు చేస్తున్న సిటీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను మంత్రి పరిశీలించారు. ట్రాఫిక్, నీటిసరఫరా, విద్యుత్ తదితరాల సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచేందుకు అమలు చేస్తున్న ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడాన్ని పరిశీలించాలని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను కేటీఆర్ ఆదేశించారు.



అనంతరం ఇండియానాపోలిస్ మేయర్ జోహగ్ సెట్‌తో సమావేశమై స్థానిక పరిపాలనలో అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. తమ నగరంలో త్వరలో అమలు చేయనున్న బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం గురించి మంత్రికి మేయర్ వివరించారు. 2 నగరాల పర్యటనలో పలు ఆసక్తికర విషయాలు పరిశీలించామని, ఇందులో కొన్ని హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top