‘ప్రైవేట్ ప్రజల’ రాజధాని ఇది

‘ప్రైవేట్ ప్రజల’ రాజధాని ఇది - Sakshi


సాక్షి, హైదరాబాద్: అందరూ ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నది ప్రజారాజధాని కాదు..ప్రైవేట్ రాజధాని అని తేలింది. కేపిటల్‌సిటీ మాస్టర్ ప్రణాళికే ఇది స్పష్టం చేసింది. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)లో రైతుల నుంచి తీసుకున్న 35వేల ఎకరాలతోపాటు ప్రభుత్వానికి చెందిన అటవీ, దేవాదాయ శాఖల చెందిన మరో 19వేల ఎకరాల్లో సింహభాగం ప్రైవేట్ సంస్థలకు, రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి కట్టపెడుతోంది. మొత్తం 54వేల ఎకరాల్లో రహదారులు, గ్రామాల సెటిల్‌మెంట్స్, ప్రభుత్వ ఇనిస్టిట్యూషన్స్, మౌలిక సదుపాయాలు, సీడ్ కేపిటల్, వాటర్ బాడీలకు అవసరమయ్యే భూములను తప్ప మిగతా 21,870 ఎకరాలను సింగపూర్‌కు చెందిన కంపెనీలకు, ప్రైవేట్‌సంస్థలకు ఏకంగా 99ఏళ్ల పాటు లీజుకు కేటాయించనుంది.


 


ఆ భూముల్లో ఆ కంపెనీలు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయనున్నాయి. భూసమీకరణలో భాగంగా వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకోవడం, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకేనని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయి.

 

 ప్రైవేటు సంస్థలకు...  రియల్ ఎస్టేట్‌కే ప్రాధాన్యం...

 

 భూసమీకరణలో మొత్తం 54,272 ఎకరాలను (రైతుల నుంచి సేకరించిన భూమితోపాటు దేవాదాయ తదితర ప్రభుత్వ భూములు కలిపి) ప్రభుత్వం తీసుకోనుందని, అందులో ఏ రంగానికి ఎన్ని ఎకరాలు కేటాయించాలో కేపిటల్‌సిటీ మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టం చేశారు. ఈ మొత్తం భూమిలో పార్కులు, గ్రీనరీ, రోడ్డు, వాటర్‌బాడీల డెవలప్‌మెంట్‌కు సగం భూమి, మిగతా 27వేల ఎకరాల పైచిలుకులో ప్రస్తుతం గ్రామాలను కొనసాగించేలా 2,705 ఎకరాలు, సీడ్‌కేపిటల్‌కు 2,667 ఎకరాలు తీసివేస్తే, మిగతా 21,870 ఎకరాలను రియల్‌ఎస్టేట్, వాణిజ్య అవసరాలు, పరిశ్రమలు, హోటల్స్, మిశ్రమ వినియోగం, గోల్ఫ్‌కోర్స్, క్రీడా, రిక్రియేషన్ రంగాలతోపాటు నివాస ప్రాంతాల అభివృద్ధి పేరుతో ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టనుంది. (వాణిజ్యరంగాలకు 3,550 ఎకరాలను, పరిశ్రమలకు 3,065, హోటల్స్‌కు 770, మిశ్రమ వినియోగానికి 682, గోల్ఫ్‌కోర్స్‌లకు 417, క్రీడారంగాలకి 430 ఎకరాలను కేటాయించింది. రిటైల్ రంగం పేరుతో 67 ఎకరాలను, రిజర్వ్ పేరిట 242 ఎకరాలను, వైట్‌సైట్ పేరుతో కేటాయించిన 35 ఎకరాలనూ వాణిజ్య, పరిశ్రమల రంగాలకు ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి) ఈ భూములను ప్రైవేట్ డెవలపర్‌కు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే.. ప్రభుత్వం రియల్ దందా చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోంది.

 

 భూముల కేటాయింపులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. మరోవైపు రియల్‌ఎస్టేట్‌లో భాగంగా ధనికవర్గాలకు జీ ప్లస్ 15 అంతస్థుల అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి 2,140 ఎకరాలను కేటాయించింది. ఈ భూమి కృష్ణా నదికి అభిముఖంగా ఉండాలని, అప్పుడే డెవలపర్‌ను, కొనుగోలు చేసుకునే వారిని ఆకర్షిస్తాయని ప్రణాళికలో పేర్కొన్నారు. అలాగే మధ్యతరగతి వర్గాల కోసం జీ ప్లస్ ఏడు అంతస్థుల భవనాల నిర్మాణం కోసం 9,435 ఎకరాలను కేటాయించారు. ఏ రైతులైతే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారో వారికీ ఇక్కడే ప్లాట్లను కేటాయిస్తారు. జీప్లస్ 7 అంతస్థుల నిర్మాణం రైతులు స్వయంగా చేసుకోలేరు కాబట్టి, వారు కూడా డెవలపర్లనే ఆశ్రయించాల్సి ఉంటుంది. కృష్ణానదికి అభిముఖంగా ప్రతిపాదించిన జీప్లస్ 15 కేటగిరీ ప్రాంతమే తొలుత డెవలపర్లను కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన భూములిచ్చిన రైతులకు ప్రతిపాదిస్తున్న జీప్లస్ 7 ప్రాంతం అభివృద్ధికి సంవత్సరాలపాటు నిరీక్షించక తప్పదు. దీన్ని పరిశీలిస్తే రాజధాని ప్రాంతంలో సామాన్యుడు కొద్ది స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు.

 

 స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలూ ప్రైవేటువే..

 

 పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు 847 ఎకరాలను, ప్రైవేట్ వర్సిటీల స్థాపనకు 1,037 ఎకరాలను కేటాయించారు. వీటన్నిటినీ ప్రైవేట్‌రంగంలోనే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయదని ఓ సీనియర్ మంత్రి తెలిపారు. అంటే.. ప్రభుత్వంలోని ఓ మంత్రి  కాలేజీల కోసం వందల ఎకరాలను కేటాయించేందుకేనని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజా రాజధాని అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ, నూతన రాజధానిలో ఏ ఒక్క సామాన్యుడు గానీ, మధ్యతరగతి వర్గాలు గానీ సొంతంగా స్థలమో కొనుక్కోవ డం,అందులో ఇంటిని నిర్మించుకునే పరిస్థితే లేకుండా, డెవలపర్ ద్వారానే అభివృద్ధి చేసేలా నిబంధనలు విధించడం చూస్తే ఇది.. ముమ్మాటికీ ప్రైవేటు రాజధానే అని స్పష్టమవుతోంది.

 

 అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ ఏమన్నారంటే...

 

 రైతుల పొట్ట కొట్టి భూసమీకరణ పేరుతో లాక్కున్న భూములను బడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకేనని ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది మార్చి 20వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో చర్చలో భాగంగా ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములతో రియల్‌ఎస్టేట్ దందా చేసేందుకే ప్రభుత్వం వారి నుంచి పెద్దఎత్తున భూములను లాగేసుకుంటోందని అనుమానాలు వ్యక్తం చేశారు. రైతుల నుంచి ప్రైవేట్ సంస్థలే ఎక్కువ ధరకు కొనుగోలు చేసుకునేలా, ఆ లాభాలు నేరుగా రైతులకే అందేలా చూడాలని వైఎస్ జగన్ ప్రభుత్వానికి సూచించారు. రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను వారికి తిరిగి ఇచ్చేయండని హితవు పలికారు.

 

 మొత్తం ప్రభుత్వం సమీకరిస్తున్న భూమి     54వేల ఎకరాలు

 ఇందులో ప్రభుత్వ భూమి (అటవీ, దేవాదాయ శాఖలకు చెందిన) 19వేల ఎకరాలు

 గ్రీనరీ, రోడ్లు, పార్కులు తదితరాలతోపాటు నివాసప్రాంతాలు, సీడ్‌కేపిటల్ మినహా డెవలపర్‌కు ఇచ్చేది     

 21,870 ఎకరాలు


 




 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top