మావోయిస్టులను చర్చలకు పిలవండి

మావోయిస్టులను చర్చలకు పిలవండి - Sakshi


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూంచీ కమిటీ సూచన

 

 సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు నేతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు ఆహ్వానించాలని పూంచీ కమిటీ సూచించింది. మావోయిస్టులపై యుద్ధం చేయడం సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన పూంచీ కమిటీ మావోయిస్టుల సమస్య పరిష్కారానికి సంబంధించి పలు సిఫార్సులను చేసింది. ఇటీవల జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో వీటిపై చర్చించారు. ఈ సిఫార్సులపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రప్రభుత్వం సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తన అభిప్రాయాలను వెల్లడించింది. మావోలతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని స్పష్టం చేసింది. హింసను విడనాడి వస్తే చర్చలు జరిపేందుకు అభ్యంతరం లేదని కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది.



 వైఎస్ ప్రభుత్వం తరహాలో మళ్లీ చర్చలు జరపాలి..

 గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టు అగ్రనేతలను చర్చలకు ఆహ్వానించి నెలరోజులపాటు చర్చించిన విషయం, ఈ చర్చలకు అప్పటి హోంమంత్రి జానారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. వైఎస్సార్ ప్రభుత్వం ఒకపక్క మావోయిస్టు నేతలతో చర్చలు జరపడంతోపాటు సామాజిక, ఆర్థిక కోణంలో చర్యలు చేపట్టింది. అలాగే మావోయిస్టులకు మంచినీళ్లు ఇచ్చారనో, భోజనం పెట్టారనే కారణాలతో గ్రామాల్లో ప్రజల్ని అరెస్టు చేయడం, వేధింపులకు గురిచేయడం వంటివాటికి స్వస్తి పలికింది. ఆ చర్చల అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టుల చర్యలు గణనీయంగా తగ్గిపోయాయి. అదేతరహాలో ఇప్పుడు మావోయిస్టు నేతలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలని పూంచీ కమిటీ సూచించింది. 2012 నుంచి ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 680 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారు.

whatsapp channel

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top