ఆదాయం పెరిగినా లోటే

ఆదాయం పెరిగినా లోటే - Sakshi


- బడ్జెట్ అంచనాలకు ఇంకా దూరమే

- ఈ ఆర్థిక ఏడాది తొలి రెండు నెలల్లోనే 27.45 శాతం ఆదాయ వృద్ధి

- గణనీయంగా పెరిగిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం

- అయినా పెండింగ్‌లోనే అనేక బకాయిలు, ఇన్‌పుట్ సబ్సిడీ

- నెల రోజులుగా రూ.5 వేల కోట్ల బిల్లులు నిలిపివేత

 

 సాక్షి, హైదరాబాద్: గణనీయమైన ఆదాయ వృద్ధి సాధించినా.. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ అంచనాలకు దూరంలోనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ 27.45 శాతం ఆదాయ వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అద్భుతమైన పురోగతి సాధించటంతో ఇది సుస్థిర ప్రగతికి సంకేతమని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈ ఏడాది అవే రెండు నెలల్లో రూ.1,656 కోట్ల మేర రాష్ట్ర ఆదాయం పెరిగింది. 2015 ఏప్రిల్, మే నెలల్లో కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, ట్రాన్స్‌పోర్ట్, గనులు తదితర శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.6,031 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఏడాది ఏకంగా రూ.7,687 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే రకమైన సుస్థిర ఆదాయ వృద్ధి రేటు కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి స్టేట్ ఓన్ రెవెన్యూ రూ.11,500 కోట్ల మేరకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ పరిస్థితులు చూస్తుంటే అది రూ.10 వేల కోట్లకు మించే అవకాశం కనిపించడం లేదు.



 అంచనాలు అందేనా?

 2016-17లో స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ ద్వారా రూ.54,869 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది సవరించిన బడ్జెట్ ప్రకారం రూ.43,534 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వాస్తవ లెక్కల ప్రకారం ఇది రూ.41 వేల కోట్లకు మించలేదని సమాచారం. ఇప్పటికీ గత ఏడాదికి సంబంధించిన వాస్తవ ఆదాయ, వ్యయాలను అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వెల్లడించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిరుటి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన కొన్ని వివరాలను ఇప్పటికీ సమర్పించకపోవటంతో  2015-16 వాస్తవ గణాంకాలింకా వెల్లడి కాలేదు.



ఈ రెండు నెలల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 64 శాతం పెరిగింది. ఎక్సైజ్ శాఖలో 120 శాతం ఆదాయం పెరిగింది. లగ్జరీ టాక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం, అమ్మకపు పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 17 శాతం పెరిగినట్లు గణాంకాలున్నాయి.  గత ఏడాది ఒక్క వాణిజ్య పన్నుల శాఖ ద్వారానే రాష్ట్ర ఖజానాకు అత్యధికంగా రూ.30 వేల కోట్ల ఆదాయం జమయింది. ఈ ఏడాది అదే శాఖ నుంచి రూ.43 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని బడ్జెట్‌లో అంచనా వేసింది. ఈ లెక్కన రూ.13 వేల కోట్ల ఆదాయం ఒక్క శాఖలోనే పెరగాల్సి ఉంది. కానీ తొలి రెండు నెలల్లో ఈ శాఖ ద్వారా వచ్చిన ఆదాయం రూ.6 వేల కోట్లకు చేరలేదు. ఈ లెక్కన వాణిజ్య పన్నుల ఆదా య వృద్ధి రూ.6 నుంచి రూ.8 వేల కోట్లకు మించటం తప్ప.. బడ్జెట్ అంచనాలను అందుకోవటం కష్టమేనని స్పష్టమవుతోంది.



 పెరిగిన ఖర్చులతో చిక్కు

 గతేడాదితో పోలిస్తే ఖర్చులు సైతం అమాంతం పెరిగిపోయాయి. ప్రతినెలా రూ.2 వేల కోట్లకు పైగా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించటంతోపాటు ఇప్పటికే ఖర్చుల పద్దులో ఉన్న రైతు రుణమాఫీకి రూ.4,500 కోట్లు, ఆసరా పెన్షన్లు, విద్యుత్ బియ్యం సబ్సిడీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఇబ్బందికరంగా మారాయి. గడిచిన మూడు నెలల్లోనే రాష్ట్ర అభివృద్ధి రుణం పేరిట బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు అప్పు తెచ్చింది. ఇదే నెలలో మరో రూ.1,500 కోట్లు సేకరించనుంది.

 

 జీతాలకు సైతం కటకట

 రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలైలో పెంచాల్సిన డీఏ, తొమ్మిది నెలల పీఆర్‌సీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్‌లోనే పెట్టింది. మరోవైపు గత నెల రోజులుగా వివిధ పనులకు చెల్లించే బిల్లులన్నీ నిలిపివేసింది. సర్వర్ డౌన్ పేరుతో దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా బిల్లులను ఆర్థిక శాఖ ఆపేసినట్లు వివిధ శాఖల అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస)్థ ఉద్యోగులకు తొమ్మిది నెలలుగా జీతాల చెల్లింపులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయలేదు. దీంతో ఆసరా పెన్షన్లు, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పథకాలకు వినియోగించే నిధులను దారి మళ్లించి వేతనాలను సర్దుబాటు చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఆదాయ వృద్ధి రేటుకు అనుగుణంగా ప్రభుత్వం వ్యయాన్ని కట్టడి చేయటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top