జల విధ్వంసం

జల విధ్వంసం - Sakshi


పగిలిన కృష్ణా పైప్‌లైన్... ఉప్పొంగిన జలాలు జనం పరుగులు

బాలాపూర్ చౌరస్తాలో స్తంభించిన ట్రాఫిక్

నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జలమండలి ఎమ్‌డీ

 


మీర్‌పేట్(హైదరాబాద్): సమయం.. బుధవారం మధ్యాహ్నం 1.58 గంటలు.. ఒక్కసారిగా భారీ శబ్దం. ఏం జరిగిందోనని స్థానికులు తేరుకొని చూసేసరికి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కృష్ణా జలాలు. సినిమా సన్నివేశాలను తలపించేలా ఆ నీటితో పాటే ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా పైకి ఎగిరికిందపడడం...ప్రవాహంలో కొట్టుకుపోవడం.. .క్షణాల్లో జరిగిపోయాయి. విస్ఫోటం దాటికి ఓ ఆటో తునాతునకలైంది. ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సమీప దుకాణాలను భారీగా నీరు ముంచెత్తింది. ఈ భయానక వాతావరణం సరూర్‌నగర్ మండలం బాలాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది.



సాహెబ్‌నగర్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి వరకు గల కృష్ణాఫేజ్-2 రింగ్‌మెయిన్-1 పైప్‌లైన్‌కు గల జాయింట్ వద్ద ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పేలిపోడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో స్థానికులు భీతిల్లిపోయారు. బాంబు పేలుడు సంభవించిందేమోనని కొంతమంది పరుగులు తీశారు. ప్రస్తుతం భారీ లీకేజీ ఏర్పడిన ప్రాంతంలో రెండు రోజుల క్రితమే చిన్నపాటి లీకేజీకి మరమ్మతులు పూర్తి చేయడం గమనార్హం. ఘటనా స్థలాన్ని జలమండలి ఎమ్‌డీ బి.జనార్దన్‌రెడ్డి, ఈఎన్‌సీ సత్యనారాయణ, సీజీఎం విజయ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.



లీకేజీల గండం

కృష్ణా ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 పైప్‌లైన్లు, నగరంలో నీటి సరఫరాకు ఏర్పాటు చేసిన రింగ్‌మెయిన్ పైప్‌లైన్లకు నిత్యం ఏదో ఒక చోట గండి పడుతుండడంతో తాగునీరు వృథా అవుతోంది. వీటి నివారణకు జలమండలి ఏటా రూ.50 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. అరకొర మరమ్మతులతో లీకేజీలకు అడ్డుకట్ట పడడం లేదు. పీఎస్సీ, ఆర్‌సీసీ మిశ్రమంతో తయారు చేసిన పైప్‌లైన్ల స్థానంలో మైల్డ్‌స్టీల్‌తో రూపొందించినవి వేయకపోవడం...రహదారుల విస్తరణ, భూగర్భ కేబుల్స్ వేస్తున్నపుడు... భారీ ట్రక్కులు పైప్‌లైన్‌ల పైనుంచి రాకపోకలు సాగిస్తుండడంతో ఏదో ఒక చోట లీకేజీలు ఏర్పడుతున్నాయి.



మరోవైపు పైప్‌లైన్ జాయింట్లు, కవర్లు, వాల్వ్‌ల ఏర్పాటు సమయంలో తలెత్తే ఇంజినీరింగ్ లోపాలను క్షేత్రస్థాయి అధికారులు సరిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో  వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తున్న తాగునీరు వృథా అవుతోంది. జలమండలి నిత్యం సరఫరా చేస్తున్న 365 ఎంజీడీల జలాల్లో 40 శాతం సరఫరా నష్టాలకు లీకేజీలే కారణమని తెలుస్తోంది.



 పీఎస్సీ పైప్‌లైన్ కావడమే కారణం

 కృష్ణా పైప్‌లైన్ పగలడానికి ప్రధాన కారణం అది ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్‌తో తయారు చేసినది కావడమే. బాలాపూర్ చౌరస్తాలో సుమారు 500 మీటర్ల మార్గంలో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ మైల్డ్‌స్టీల్ పైప్‌లైన్ వేయాల్సి ఉందని గతంలో ప్రభుత్వానికి నివేదించాం. ఈ మార్గంలో ప్రస్తుతం రహదారి విస్తరణ పనులు జరుగుతుండడం... రక్షణ శాఖకు చెందిన 50 టన్నుల సామర్థ్యం గల భారీ ట్రక్కులు రాకపోకలు సాగిస్తుండడంతోనే పైప్‌లైన్ జాయింట్ వద్ద ఒత్తిడి పెరిగి పగిలినట్టు భావిస్తున్నాం.

 -సత్యనారాయణ,  జలమండలి ఇంజినీర్ ఇన్ చీఫ్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top