పల్లె పల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: కేటీఆర్

పల్లె పల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: కేటీఆర్ - Sakshi


హైదరాబాద్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కంటోన్మెంట్ బాలంరాయిలోని గీతాంజలి పాఠశాలలో మంగళవారం ఏపీ, తెలంగాణ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సెమినార్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మెరుగైన విద్య కోసం అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ-లెర్నింగ్, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలోని రెండు వేల గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తండాలు, పంచాయతీలు కలిపి 10 వేల గ్రామాలకు ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యాశాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

 

జగ్గారెడ్డికి ప్రజలే గుండు కొడతారు


లక్ష మెజార్టీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేషంతోపాటు పార్టీని కూడా మార్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో జగ్గారెడ్డిని ప్రజలు మరోసారి ఓడించి గుండుకొడతారని జోస్యం చెప్పారు. బీజేపీని బాబుగారి జగ్గారెడ్డి పార్టీగా ఆయన వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన జగ్గారెడ్డికే బీజేపీ టికెట్ కేటాయించడం సిగ్గు చేటన్నారు.

 

పొన్నాలా.. సిగ్గుందా: కేటీఆర్ ధ్వజం

మెదక్: ‘పొన్నాలా నీకు సిగ్గుందా!.. కరెంట్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?.. బొగ్గు నిక్షేపాలున్నా తెలంగాణను కాదని ఆంధ్రలో, రాయలసీమలో విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసింది మీరు కాదా? కనీసం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్లు వేసేందుకు ఎప్పుడైనా ప్రయత్నించారా? వంద రోజులు కూడా నిండని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేనిది ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో కలసి నడిచారా? కనీసం పునర్నిర్మాణంలోనైనా కలిసిరండి’ అంటూ పంచాయతీరాజ్, ఐటీ శాఖ  మంత్రి కె. తారకరామారావు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

 

మంగళవారం మెదక్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంట్ సమస్యకు టీఆర్‌ఎస్ కారణమని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించడం తగదన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం ఖాయమైపోయిందని, అందరి మైండ్‌బ్లాక్ అయ్యేలా 5 లక్షలపై చిలుకు ఓట్లతో గెలిపించాలని ఆయన కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top