మృత్యువులోనూ చిరంజీవి జతిన్

మృత్యువులోనూ చిరంజీవి జతిన్ - Sakshi


ఆ బాలుడు మరణిస్తూ కూడా ఆరుగురికి జీవితాల్ని ఇచ్చాడు. మృత్యువుతో పోరాటంలో ఓడినా తన అవయవ దానంతో అందరి హృదయాల్లో చిరంజీవి అయ్యాడు. ఓ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన బాలుడు జతిన్ ఇప్పుడు నిజంగా రియల్ హీరోగా వేనోళ్ల కీర్తి పొందుతున్నాడు. మానవత్వంఉన్న ప్రతి గుండెను కదిలించే ఆ కథనం..           - ఖైరతాబాద్

 

 ఖైరతాబాద్ డివిజన్‌లోని జాగీర్‌దర్బాడాలో నివాసముండే బి.కృష్ణ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. రెండో సంతానమైన బి.జతిన్(14) స్థానికంగా ఉన్న మాస్టర్ ట్యాలెంట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వీరి ఇంటి పక్కనే నల్గొండ జిల్లా తిరుగలపల్లి గ్రామానికి చెందిన సైదులు, ఈశ్వరమ్మలు ఎన్టీఆర్‌గార్డెన్‌లో మాలీలుగా పనిచేస్తున్నారు. వీరికి గణేష్ యాదవ్(14) ఒక్కగానొక్క సం తానం. ఇద్దరూ ఒకే స్కూల్లో సహ విద్యార్థులు కావడం, ఇరుగుపొరుగులవ్వడంతో ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు.

 

 ప్రమాదం జరిగిందిలా....

 

 ఈ నెల1వ తేదీన గణేష్‌యాదవ్ అన్న మల్లేష్ ఉదయం 8 సమయంలో హీరోహోండా స్ల్పెండర్‌ప్లస్‌పై ఇంటికి వచ్చా డు. వద్దంటున్నా గణేష్ ఇప్పుడే వస్తానంటూ ఆ బండిపై బయటకు వచ్చాడు. జతిన్ కలవడంతో ఇద్దరు కలిసి బైక్‌పై నిమజ్జనం అయిన ఖైరతాబాద్ మహాగణపతిని చూసేం దుకు బయలుదేరారు. ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో బైక్ అదుపు తప్పి డ్రైవింగ్ చేస్తున్న గణేష్‌యాదవ్, జతిన్‌లు ఫుట్‌పాత్‌పై పడ్డారు. దాంతో వీరి తలలకు తీవ్రగాయాలయ్యాయి.  ఇద్దరినీ గాంధీ హాస్పిటల్‌కు తరలిం చారు. చికిత్స పొందుతూ అదే రోజు గణేష్‌యాదవ్ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం జతిన్‌ను ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అయితే బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు ఆదివారం ధ్రువీకరించారు. జతిన్ కిడ్నీలు, గుండె, కార్నియాలు, కాలేయాన్ని సేకరించారు. గుండెను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. అవయవదానం చేసిన జతిన్‌కు పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఘన నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం పంజగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top