ఆ మాట వెనకున్న ఆంతర్యమేంటి?

ఆ మాట వెనకున్న ఆంతర్యమేంటి? - Sakshi


సీఎంపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం

పోలవరానికి, ప్రత్యేక హోదాకు సంబంధమేంటి?




సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను వదులుకున్నానని సీఎం చంద్రబాబు చెప్పడంలో ఆంతర్యం ఏమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధం ఏమిటని నిలదీశారు. పార్టీ కేంద్రకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరాన్ని విభజన చట్టంలో పొందుపరిచారని, ఆ ప్రాజెక్టును నిర్మించే పూర్తి బాధ్యత కేంద్రానిదేనన్నారు. కేంద్రం నుంచి పోలవరం ప్యాకేజీ తీసుకోవటంవల్ల చంద్రబాబు, ఆయన బినామీలే లబ్ధి పొందారన్నారు. పోలవరం తన స్వప్నంగా చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు.



పోలవరం రాష్ట్ర ప్రజలందరి స్వప్నమన్నారు. అందుకే దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో అంకురార్పణ చేశారని చెప్పారు. 2004కు ముందు చంద్రబాబు, ఆయన పార్టీ అధికారంలో ఉన్నా ఆ కల నెరవేర్చాలనే ఆశయం కలగలేదా? అని ఎద్దేవా చేశారు. ఆనాడు పోలవరాన్ని ఆపటానికి టీడీపీ చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి పేజీ చూపిస్తామని చంద్రబాబు, టీడీపీ నేతలకు బొత్స సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కలల పంట పోలవరం పూర్తవ్వాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంతో చంద్రబాబు ఇంకో దోపిడీకి తెరదీశారని బొత్స మండిపడ్డారు.  రాష్ట్రంలో పోలవరం, అమరావతి, మరే అభివృద్ధికీ వైఎస్సార్‌సీపీ అడ్డంకి కాదని, కేవలం ప్రభుత్వం చేస్తున్న అవినీతినే తాము వ్యతిరేకిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు. దోపిడీ, వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టొద్దన్నారు.



వైఎస్‌ ప్రయార్టీ ప్రాజెక్టులు..: చంద్రబాబు ప్రభుత్వం ప్రయార్టీ హైదరాబాద్‌ అయితే.. తమ ప్రభుత్వ ప్రయార్టీ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులని వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలి మంత్రివర్గ సమావేశంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందాకు వివరించారని బొత్స తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై మోహన్‌కందా ప్రజెంటేషన్‌ ఇస్తున్నప్పడు అదే సమావేశంలో ఉన్న జేసీ దివాకరరెడ్డి వీటిని చంద్రబాబు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారని ఆయన చెప్పారు. ప్రభుత్వాలకు ప్రయార్టీలుంటాయని, సముద్రంలోకి వెళ్తున్న వృథాజలాల్ని అరికట్టాలని వైఎస్‌ కోరటంతో ఈ ప్రాజెక్టులను మీ ముందు పెట్టామని మోహన్‌కందా బదులిచ్చారని బొత్స వివరించారు. వాస్తవాలు తెలిసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని జేసీకి హితవు పలికారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top