వైద్య పోస్టుల భర్తీపై నీలినీడలు!

వైద్య పోస్టుల భర్తీపై నీలినీడలు! - Sakshi


సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసే ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ద్వారా చేపట్టే ఈ నియామకాల్లో గందరగోళం నెలకొంది. ఫలితంగా ఒక్క మెదక్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మొత్తం ప్రక్రియకే బ్రేక్ పడింది.



 వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకానికి అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వైద్యుల పోస్టులు రాష్ట్రస్థాయివి కావడం, నర్సుల పోస్టులు జోనల్ స్థాయివి కావడంతో సంబంధిత జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల వారూ దరఖాస్తు చేసుకున్నారు. వేలల్లో దరఖాస్తులు వ చ్చిపడ్డాయి. ప్రతిభ ఆధారంగా ఉద్యోగం పొందిన వారు దరఖాస్తు చేసుకున్న జిల్లాల్లో విధుల్లో చేరగా.. చాలా మంది ఉద్యోగాల్లో చేరలేదు. అల్లోపతికి చెందిన వారు చాలాచోట్ల చేరలేదని తెలిసింది. ఆర్‌బీఎస్‌కే పోస్టులను భర్తీ చేయకుండా, అందుకు కేటాయించిన రూ.65 కోట్లు ఖర్చు చేయకుండా ఎన్‌హెచ్‌ఎం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్‌హెచ్‌ఎం సమావేశంలో రాష్ట్ర అధికారులపై మండిపడినట్లు తెలిసింది.



 మొత్తం 1,330 పోస్టులు..

 16 ఏళ్లలోపు పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్‌ఎన్‌సీ)ను ఏర్పాటు చేయాలనేది దీని ఉద్దేశం. ఒక్కో క్లస్టర్ కింద రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 300 హెల్త్ టీంలు సేవలు అందిస్తాయి. ఇందుకోసం 630 ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులు, 300 ఏఎన్‌ఎం, 300 ఫార్మసిస్టు, మరో 100 పోస్టుల్లో ఫిజియోథెరఫిస్టులు, స్టాఫ్ నర్సులు, సైకాలజిస్టు తదితర 1,330 పోస్టులను భర్తీ చేయాలి. వీరు వైద్య సేవలు అందించడానికి జిల్లాకొక డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)ను ఏర్పాటు చేస్తారు. ఆయా కేంద్రాల్లో ఒక పిల్లల వైద్య నిపుణుడు, ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్, ఒక డెంటల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. మొత్తం 1,330 పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. అయితే అన్ని జిల్లాల్లోనూ నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపట్టారే కానీ సరైన ప్రణాళిక లేకపోవడంతో అడ్డంకులు ఏర్పడ్డాయి.

 

 మళ్లీ చేపడతాం

 మెదక్ జిల్లాలో ఆర్‌బీఎస్‌కే ప్రక్రియలో భాగంగా మొత్తం పోస్టులను భర్తీ చేశాం. అయితే మిగతా చోట్ల వివిధ జిల్లాలకు చెందిన వారు మూడునాలుగు చోట్ల దరఖాస్తు చేయడం, అన్నిచోట్లా ఉద్యోగం పొంది ఒక చోట చేరడంతో నియామక ప్రక్రియలో సమస్యలు తలెత్తాయి. ఈసారి అన్ని జిల్లాల్లో ఒకేరోజు జాబితా తయారుచేసి, ఒకేరోజు కౌన్సెలింగ్ నిర్వహించి.. పాత నోటిఫికేషన్ ఆధారంగానే భర్తీ చేపడతాం.

 - రాజేశ్వర్ తివారీ, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ

whatsapp channel

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top