ఎందుకు ఎదగలేకపోతున్నారు?

ఎందుకు ఎదగలేకపోతున్నారు? - Sakshi


- రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం దూత శివప్రకాశ్ ప్రశ్న..

-13 ఎంపీ సీట్లపై దృష్టి సారించాలని కోర్ కమిటీ భేటీలో సూచన

- 75 అసెంబ్లీ సీట్లలో గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశం

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదిగేందుకు అన్ని అవకాశాలున్నా ఆ దిశలో ఎందుకు ఎదగలేకపోతున్నారని రాష్ర్ట పార్టీ నేతలను బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కోర్‌కమిటీతో సమావేశమైన సందర్భంగా పార్టీ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఉద్యమ కార్యాచరణను రూపొం దించుకోవాలని శివప్రకాశ్ ఆదేశించారు. మరో రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండగా రాష్ట్ర పార్టీలో ఆ చురుకుదనం లోపించడం, పార్టీ కార్యక్రమాల్లో వేగం లేకపోవడంపై నిలదీసినట్లు  సమాచారం. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ పూరించేందుకు స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు.  



తెలంగాణలో 13 ఎంపీ సీట్లపై దృష్టి కేంద్రీకరించాలని, వాటిలో కొన్ని సీట్లనైనా కచ్చితంగా గెలిచేలా చూడాలని సూచించారు.  రాష్ర్టంలో 75 అసెంబ్లీ సీట్లను గెలిచేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రపార్టీ  2019 ఎన్నికలకు పూర్తిస్థాయిలో  సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో  వచ్చే ఎన్నికల్లో కొన్ని తగ్గినా ఆ లోటును కొంతమేర తెలంగాణ నుంచి భర్తీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రం లో పార్టీని బూత్‌స్థాయి నుంచి పటిష్టం చేయాలని, రైతాంగ సమస్యలపై అధిక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.  సమావేశంలో  కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్, ఎన్.రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ పాల్గొనగా, ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు హాజరుకాలేదు.



 జాతీయపార్టీ చెప్పినట్లు నడవకపోతే ముప్పే!

 తన మూడు రోజుల పర్యటనలో రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీకి సానుకూల పరిస్థితులున్న విషయాన్ని గమనించినట్లు శివప్రకాశ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర నాయకులు తమకు అనుకూలంగా మలచుకునేందుకు కృషి చేయకపోతే ఎలా అని ప్రశ్నిం చారు. జాతీయ నాయకత్వం దిశానిర్దేశం ప్రకారం రాష్ట్ర నాయకులు వ్యవహరించకపోతే లోక్‌సభ నియోజకవర్గాలవారీగా జాతీయపార్టీ ఫుల్‌టైమర్లు రంగంలోకి దిగి పనిని చక్కబెట్టాల్సి ఉంటుందని ఆయన పరోక్ష హెచ్చరికలు జారీచేసినట్లు తెలుస్తోంది. తన పద్ధతిలో జాతీయ నాయకత్వం ఆదేశాలను, సూచనలను రాష్ట్ర నాయకులకు విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఇతర సెల్‌లు ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావాలని సూచించారు.



 త్వరలో రాష్ర్ట కమిటీ ప్రకటన

 రైతుల సమస్యలపై జిల్లాస్థాయిలో కార్యక్రమాలను ఖరారు చేసుకోవాలని కోర్‌కమిటీ సమావేశం నిర్ణయించింది. పార్టీ పరిశీల కుడు శివప్రకాశ్ రాకకు ముందు జరిగిన ఈ సమావేశంలో ముందుగా రాష్ట్ర కమిటీని త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 10, 15 రోజుల్లో కొత్త జిల్లాల కమిటీలను ప్రకటించి పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని తీర్మానించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top