విమోచన దినోత్సవం జరిపేదాకా ఆగం..

విమోచన దినోత్సవం జరిపేదాకా ఆగం.. - Sakshi

బీజేపీ పదాధికారుల సమావేశంలో కె.లక్ష్మణ్‌ 

అధికారంలోకి వస్తే నిర్వహిస్తామని ప్రకటన

 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహించేదాకా ఆగేదిలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతామని లక్ష్మణ్‌ చెప్పారు.



ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్‌ చేసిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్‌ మెప్పుకోసమే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సమావేశం వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. సెప్టెంబర్‌ 1 నుంచి 9 వరకు నిర్వహించే కార్యక్రమాలకు పాత పది జిల్లాలను కేంద్రాలుగా చేసుకోవాలని, ఏర్పాట్లను కె.లక్ష్మణ్‌ పర్యవేక్షిస్తారని తెలిపారు.



కొన్ని జిల్లాల్లో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కారీ, దత్తాత్రేయ, హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్‌రావు తదితరులు పర్యటిస్తారని వెల్లడించారు. తెలంగాణ విమోచనం కోసం ఉద్యమాలు జరిగిన కేంద్రాల్లోనూ పార్టీ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించడానికి ముందుగానే అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో పర్యటిస్తామన్నారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో నిర్వహించబోయే విమోచన దినోత్సవానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆహ్వానించామని, దీన్ని భారీగా నిర్వహిస్తామని తెలిపారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top