ఏపీకి అన్యాయం జరుగుతుంటే సన్నాయి నొక్కులా?: భూమన

ఏపీకి అన్యాయం జరుగుతుంటే సన్నాయి నొక్కులా?: భూమన - Sakshi


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీ ప్రజలకు దారుణంగా నష్టం వాటిల్లుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతోందని వెఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కున్న బాబు.. కేసీఆర్‌కు పూర్తిగా లొంగి పోయారన్నారు. ఏపీకి ఎంత అన్యాయం జరుగుతున్నా అడ్డుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఐదు కోట్ల ఏపీ ప్రజలు దారుణంగా నష్టపోతారని, వాటిని ఎలాగైనా ఆపాలని కర్నూలులో ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు నిరసన దీక్ష చేపడతానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన తర్వాతే చంద్రబాబు ఆదరాబాదరాగా కేంద్ర జలవనరుల మంత్రికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.



వైఎస్ జగన్ కర్నూలులో దీక్ష చేస్తే మరింత ప్రజాదరణ పొందుతారనే ఆందోళనతో మంత్రివర్గ సమావేశంలో చర్చించారే తప్ప నిజంగా ప్రాజెక్టులను అడ్డుకోవాలని కాదన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కడితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కూడా నష్టపోతాయని, కృష్ణా డెల్టా నీటి లభ్యతకు సమాధి కట్టినట్లేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిపై కూడా ప్రాజెక్టులు కట్టాలని తెలంగాణ ప్రయత్నిస్తోందన్నారు. ఆంధ్రాలో పెద్ద ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేదనే టీఆర్‌ఎస్ విధానానికి అనుగుణంగానే చంద్రబాబు పట్టిసీమను కడుతూ పోలవరం లాంటి భారీ ప్రాజెక్టును విస్మరించారన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top