ప్రకృతికాంతకు హొయలు...

ప్రకృతికాంతకు హొయలు... - Sakshi


పట్నంలో విరిసిన ఆ కుంచె పల్లె చుట్టొచ్చిన తర్వాత కాన్వాస్‌పై పరవశించింది. ప్రతి చిత్రంలోనూ నిలువెత్తు పచ్చదనాన్ని నిండుగా పరిచింది. కెరటాల కడలని కదలకుండా కళ్ల ముందుంచుతుంది. పారే సెలయేరును అందంగా ఒడిసిపడుతుంది.. రుతురాగాలకు ఒయ్యారాలు పోయే ప్రకృతి కాంతను తైల వర్ణాల్లో ఆవిష్కరిస్తుంది. ఇంతకీ ఆ కుంచె పట్టింది నగరానికి చెందిన నరేంద్రనాథ్. దేశ, విదేశాల్లో చిత్రకళ ప్రదర్శనలిచ్చిన నరేంద్రనాథ్‌ను  ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాట ల్లోనే..

 

  నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. మా నాన్న డాక్టర్ పీఆర్ రాజు చిత్రకారుడైనా నన్ను ఏనాడూ పెయింటింగ్స్ నేర్చుకొమ్మని ఒత్తిడి చేయలేదు.  స్కూల్ డేస్‌లో పెయింటింగ్ పోటీల్లో పాల్గొనేవాణ్ని. బహుమతులు కూడా గెలుచుకున్నాను. నా చిన్నతనంలో ఆయన భారత కళాపరిషత్ పేరుతో చిత్రకళ సంస్థను నిర్వహిస్తూ.. ఎందరో ఔత్సాహికులకు చిత్రలేఖనం నేర్పేవారు. మా తమ్ముడు పలాలా అక్కడే కుంచె పట్టడం నేర్చుకున్నాడు. అద్భుతమైన

 కళాకారుడిగా ఎదిగాడు కూడా. అనుకోకుండా ఓ రోజు వాడు హఠాన్మరణం పొందడం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది.

 

 అలా మారాను..

 తమ్ముడు పోయిన కొన్నాళ్లకు స్నేహితులతో కలసి కర్ణాటకలోని బెల్గామ్ ప్రాంతంలో ఉన్న ఓ పల్లెటూరుకు వెళ్లాను. అక్కడి ప్రకృతి సంపద నన్ను కట్టిపడేసింది. తర్వాత ఐదుగురు చిత్రకారులతో కలసి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగాను. కొన్ని రోజులు అక్కడే బస చేశాను. అదే నన్ను ప్రకృతి చిత్రకారునిగా మార్చింది. అప్పటి నుంచి ఆర్మూర్, ఖమ్మం, మెట్‌పల్లి, వరంగల్.. ఇవేకాక ఇలాంటి మరెన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలకు వెళ్లాను. పచ్చని పంటపొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ నా కాన్వాస్‌పై తొంగిచూశాయి. చిత్రకళపై పట్టు సాధిస్తూనే.. కర్ణాటకలోని బీఎంఎస్ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఎఫ్‌ఏ పూర్తి చేశాను.

 

 కాన్వాస్‌పై

 తైలవర్ణాలు వాడుతూ చెట్లు, కొండలు.. గుట్టలు, వాగులు.. వంకలను పరచడం నాకెంతో ఇష్టం. ఇలా వేసిన పెయింటింగ్స్‌తో హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 20కి పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేశాను. అమెరికా, బ్రెజిల్, యూకేతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించాను. అన్ని రకాల మాధ్యమాల్లో పయింటింగ్స్ వేయగలిగినా.. ఆయిల్ పెయింటింగ్స్ వేయడానికే ప్రాధాన్యం ఇస్తాను.

 

 మరిన్ని థీమ్స్‌తో..

 నగరీకరణ వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. పల్లెలు కూడా పచ్చదనానికి క్రమంగా దూరమవుతున్నాయి. అందుకే ప్రకృతిపై అవేర్‌నెస్ తీసుకురావడానికి నా కళను ఒక వారధిగా మలుచుకున్నాను. ప్రకృతిని పరిరక్షిస్తే మనకే మేలని నా చిత్రాల ద్వారా సందేశాన్ని అందిస్తున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని థీమ్స్‌పై చిత్రాలు గీసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తా. మా నాన్న ప్రారంభించిన బేగంపేటలోని డాక్టర్ పీఆర్ రాజు ఆర్ట్ స్టడీ సర్కిల్‌లో అనేక మంది ఆర్టిస్టులను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాను.

 వీఎస్

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top