‘సుప్రీం’కు తల్లీకూతుళ్ల వివాదం

‘సుప్రీం’కు తల్లీకూతుళ్ల వివాదం - Sakshi


- హైకోర్టు తీర్పు నిలుపుదలకు నిరాకరణ

- ‘బీఈ’ వివాద పరిష్కార బాధ్యతలు పెద్ద మనుషులకు

- ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు



హైదరాబాద్:
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోలాజికల్ ఈ (బీఈ) యాజమాన్యపు హక్కు విషయంలో తల్లీ, కూతుళ్ల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. కంపెనీ డెరైక్టర్లుగా ముగ్గురు కుమార్తెల నియామకం చెల్లదని, 81 శాతం వాటాల బదలాయింపు నిబంధనలకు అనుగుణంగా లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న ఈ వివాదాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవడం మేలని స్పష్టం చేసింది.



ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతలను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.రెడ్డి, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్‌లకు అప్పగించింది. వీరు ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఈ ఉత్తర్వుల ప్రతి అందుకున్న నాటి నుంచి ఆరు వారాల్లోపు వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ నాగప్పలతో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. బీఈ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ విజయకుమార్‌రాజు దాట్ల ఇటీవల మరణించడంతో, ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది.



ఇది హైకోర్టుకు చేరడంతో,  సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. డెరైక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమల నియామకం, 81 శాతం వాటాల బదలాయింపు చెల్లదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మహిమ, పూర్ణిమలు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను గత వారం జస్టిస్ గోపాలగౌడ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇరుపక్షాల తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబాల్, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం, తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ వివాద పరిష్కార బాధ్యతలను మధ్యవర్తులకు అప్పగించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top