వారసులు: కొందరు గెలిచారు.. మరికొందరు ...

వారసులు: కొందరు గెలిచారు.. మరికొందరు ... - Sakshi


సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల పోరులో నిలబడ్డ వీఐపీల కుటుంబసభ్యులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. బంజారాహిల్స్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ ఐదు వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ముషీరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి పదకొండు వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.  ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి 12వేల పైచిలుకు మెజారిటీతో కార్పోరేటర్గా ఎన్నికయ్యారు.



వీరితో పాటు మల్కాజిగిరి ఎంఎల్‌ఏ చింతల కనకారెడ్డి కోడలు విజయలక్ష్మీ అల్వాల్ డివిజన్ నుంచి ఆరు వేల మెజారిటీతో విజయం సాధించారు. గౌలిపురా డివిజన్‌లో కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర సతీమణి లలిత విజయం సాధించారు. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం నుంచి మరోసారి విజయం సాధించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత (టీఆర్‌ఎస్) కవాడిగూడ నుంచి 11 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



ఓడిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి

కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా జాంబాగ్ డివిజన్ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ముకేశ్ తనయుడు మూల విక్రంగౌడ్ ఓటమి పాలయ్యారు. ఆయనతో పాటు గన్‌ఫౌండ్రీ డివిజన్ నుండి పోటీ చేసిన ముఖేష్ కుమార్తె శిల్ప సైతం ఓటమి పాలైయ్యారు. వీరిలో విక్రం నాలుగో స్థానంలో నిల్వగా, శిల్ప మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తార్నాక స్థానంలో ఓడారు. ఆర్‌కే పురం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహేశ్వరం ఎంఎల్‌ఏ తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి బీజేపీ అభ్యర్థి రాధా చేతిలో ఓటమిపాలయ్యారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top