‘విభజన’ బదిలీలపై నిషేధం ఎత్తివేత

‘విభజన’ బదిలీలపై నిషేధం ఎత్తివేత


సాధారణ బదిలీలపై నిషేధం యథాతథం

కారుణ్య నియామకాల అంశంపై స్పష్టత

 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన నిమిత్తం బది లీలు, ప్రమోషన్లపై విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 2014 మేలో విధించిన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ‘విభజన’ నాటి నిషేధం ఎత్తివేతకే వర్తిస్తాయి. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం యథాతథంగా కొనసాగనుంది.

 

‘విభజన’ పూర్తికావడంతో..: ఇరు రాష్ట్రాల మధ్య కమల్‌నాథన్ కమిటీ చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు అన్ని శాఖల్లో పూర్తయింది. తాత్కాలిక కేటాయింపు జాబితాలు కూడా వెల్లడయ్యాయి. కొన్ని శాఖలకు సంబంధించి తుది జాబితాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఏ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులు అక్కడ చేరిపోయారు. ఈ నేపథ్యంలో బదిలీలు, ప్రమోషన్లపై ‘విభజన’ నాటి నిషేధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

తాత్కాలిక కేటాయింపులపై అభ్యంతరాలున్న ఉద్యోగులు మినహా... స్టేట్ కేడర్, సెక్రటేరియట్‌లోని  పోస్టులు, హెచ్‌వోడీలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో తుది లేదా తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులందరికీ ఈ నిషేధం ఎత్తివేత వర్తిస్తుంది. ఇక విభజనతో ముడిపడి ఉన్న కారుణ్య నియామకాల విషయంలోనూ ఈ జీవోలో స్పష్టత ఇచ్చారు. 2014 జూన్ 2 తర్వాత మరణించిన/అనారోగ్య కారణాలతో రిటైరైన ఉద్యోగులు తుది కేటాయింపులో తెలంగాణ రాష్టానికి చెందినట్లయితే... జూన్ 2 కంటే ముందు మరణించిన/అనారోగ్యంతో రిటైరైన ఉద్యోగులకు సంబంధించిన పోస్టు తెలంగాణకు కేటాయించి ఉంటే... ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి తెలంగాణ స్థానికుడై ఉంటే కారుణ్య నియామకానికి అర్హులుగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిషేధం ఎత్తివేతకు సాధారణ బదిలీలపై నిషేధానికి సంబంధం లేదు. సాధారణ బదిలీలపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

కారుణ్య నియామకాల కమిటీ చైర్మన్‌గా ఎంజీ గోపాల్

కారుణ్య నియామకాల రాష్ట్ర స్థాయి కమిటీకి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్‌ను చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  అనారోగ్యంతో రిటైరైన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఉద్యోగం ఇచ్చే ప్రక్రియను ఈ కమిటీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం మెడికల్ బోర్డులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు, ఆయా విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించే బాధ్యతను చేపడుతుంది.   

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top