ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అరెస్టు

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అరెస్టు - Sakshi


హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలపై దాడి కేసులో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని సోమవారం మీర్‌చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయం లో సోమవారం డీసీపీ వి.సత్యనారాయణ అదనపు డీసీపీ కె.బాబురావుతో కలసి ఈ వివరాలు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 2న మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిలపై అసదుద్దీన్ తన అనుచరులతో కలసి దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితులు ఫిర్యాదు మేరకు ఐపీసీ 143, 341,506, ఆర్/డబ్ల్యూ-141 సెక్షన్ల కింద కేసులు నమో దు చేశారు.



డీసీపీ కార్యాలయంలో అసద్‌ను ప్రశ్నించిన అనంతరం సీసీ కెమెరాల విడియో ఫుటేజీల ఆధారంగా మీర్‌చౌక్ పోలీసులు ఉదయం 10.15కి అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లిలో ఎమిదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అనంతరం రూ. 5 వేల రెండు సొంత పూచీకత్తుపై ఆయనకు బెయిలు మంజూరు చేశారు. షబ్బీర్ అలీపై దాడికి పాల్పడిన కసఫ్, షేక్ ఆబేద్ హుస్సేన్, ఎతేశ్యాం, నజీర్, జాఫర్, మిస్బాలను ఇప్పటికే అరెస్ట్ చేశామని డీసీపీ చెప్పారు. ఈ కేసులో మరో ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. మొత్తం ఎన్నికల రోజు 15 కేసులు నమోదు కాగా... చిన్నాచితక, పాల్స్ కేసులు 350 వరకు నమోదయ్యాయన్నారు.  మీర్‌చౌక్ ఘటనలో కానిస్టేబుల్ మురళి చాకచాక్యంగా  దాడికి పాల్పడ్డ వారిని పట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులపై పెట్టిన కేసుల్లో  ఆధారాలు లభించక ఎత్తివేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై చాంద్రాయణగుట్ట పీఎస్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుపై ఆధారాలూ లభించక దాన్ని కొట్టివేస్తున్నామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top