నిఖా పేరుతో దగా


  •  వారంలో ఇద్దరుబాలికలతో అరబ్‌షేక్ పెళ్లి

  •  షేక్ సహా 12 మంది నిందితుల అరెస్టు

  • హైదరాబాద్, న్యూస్‌లైన్: పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వారం వ్యవధిలో ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్నాడో అరబ్‌షేక్. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్‌తో పాటు ఇతనికి సహకరించిన 11మందిని భవానీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీ కథనం ప్రకారం.. ఒమన్‌కి చెందిన అల్ మదసరీ రాషేద్ మసూద్ రషీద్ (61) టూరిస్ట్ వీసాపై ఈ నెల 5వ తేదీన నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్ రోడ్డు నెం.11లోని పటేల్ అవెన్యూలో గది అద్దెకు తీసుకున్నాడు. పాతబస్తీకి చెందిన బ్రోకర్ల ద్వారా తలాబ్‌కట్టకు చెందిన బాలిక (14)ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాడు.

     

    బ్రోకర్లు మహ్మద్ జాఫర్ అలీ, కరీమున్నీసా బేగం, అమీనా బేగం, మహ్మద్ ఉస్మాన్‌లు బాలిక తల్లి రబియా బేగం, పెంపుడు తండ్రి ఖాజా పాషాలను ఒప్పించి వారికి రూ.60వేలు అందించారు. ఈ నెల 9వ తేదీన ఖాజీ మహ్మద్ గౌస్ మోయియుద్దీన్ సమక్షంలో బాలికకు అరబ్ షేక్‌తో వివాహం జరిపించారు. అయితే, సదరు బాలిక అదేరోజు తప్పించుకొని తన మామకు సమాచారం ఇచ్చింది. ఆయన భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. షేక్ అద్దెకుంటున్న గదిపై దాడి చేశారు. సదరు షేక్ చెరలో మరో బాలిక ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు.

     

    నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. శివరాంపల్లికి చెందిన బాలిక (15)ను ఈనెల 15న పెళ్లి చేసుకున్నానని వెల్లడించాడు. హసీనాబేగం, షాకీరా బేగంలు బ్రోకర్లుగా వ్యవహరించారని చెప్పాడు. ఖాజీ జాహెద్ అలీ హైదర్ సమక్షంలో పెళ్లి చేసుకొని బాలిక తల్లి షైనాజ్ బేగంకు రూ. 80వేలు చెల్లించానని తెలిపాడు. పోలీసులు రెండో బాధితురాలైన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అరబ్ షేక్ నుంచి పాసుపోర్టుతో పాటు రూ.5వేల నగదు, 2,725 డాలర్లు, 120 రియాల్స్, మూడు సెల్‌ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top