ఆంక్షలతో కాపులను రెచ్చగొడుతున్నారు

ఆంక్షలతో కాపులను రెచ్చగొడుతున్నారు


రాష్ట్ర ప్రభుత్వంపై  వైఎస్సార్‌సీపీ నేత అంబటి ధ్వజం

 

 సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఉద్దేశ పూర్వకంగానే కాపులను రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఏం జరుగుతుందని ముద్రగడ దీక్ష  ప్రాంతంలో అంత పోలీసు భద్రత. అధికార పార్టీ నేతలు అనేక హత్యలు, అన్యాయాలకు పాల్పడుతున్నా, వారందరిపై కేసులు పెట్టకుండా వదిలేసి.. ఇక్కడ మాత్రం ఇంత ఆర్భాటమా? సైన్యాన్ని దించినట్టు దించి రెచ్చగొడుతున్నారు.



ప్రతి గ్రామంలోనూ కాపులను పిలిచి, వారి ఫోటోలు తీసుకొని పోలీసు షీట్లు ఓపెన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ముద్రగడకు అనుకూలంగా ఎవరూ దీక్షలు చేయవద్దంటూ పోలీసులు హెచ్చరించడం తగిన పనికాదు. ఇది సమాజంలో ఒకవర్గాన్ని రెచ్చగొట్టడమే అవుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ గుర్తు పెట్టుకోవాలి. అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దని కోరుతున్నాం’’ అని అంబటి చెప్పారు. కాపులకు పోటీగా చంద్రబాబు బీసీలను రెచ్చగొట్టి రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, దానిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలని అంబటి కోరారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చాలన్నదే వైఎస్సార్‌సీపీ కోరుకుంటోందన్నారు.



 దీక్షకు వైఎస్సార్‌సీపీ పూర్తి సంఘీభావం

 ముద్రగడ చేపట్టిన దీక్షకు వైఎస్సార్‌సీపీ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు అంబటి చెప్పారు. ఆయన దీక్షకు కూర్చోకుండానే సమస్య పరిష్కారం అవుతుందని భావించామని, కానీ టీడీపీ నేతలు ఆయనతో తూతూమంత్రంగానే చర్చలు జరిపడంవల్ల దీక్షకు ఉపక్రమించాల్సి వచ్చిందన్నారు. కర్ణాటకలో ఒక వర్గాన్ని బీసీల్లో చేర్చే కార్యక్రమాన్ని ఒక నెలలో పూర్తి చేశానని ఆ కమిషన్‌కు నేతృత్వం వహించిన ద్వారాకానాథ్ మీడియాకు చెప్పిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top