మరో మూడు రోజులు వర్షాలు


జూన్ రెండు లేదా మూడో వారంలో రాష్ట్రానికి రుతుపవనాలు



 సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దానికి అనుబంధంగా తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని కారణంగా మరో మూడు రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక చోట్ల ఒక మోస్తరు వర్షాలు.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రతీ వేసవిలోనూ మార్చి, ఏప్రిల్ నెలల్లో క్యుములోనింబస్ మేఘాలు రావడం సహజమని.. దాని కారణంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.



ఉపరితల ఆవర్తనం బలహీనపడ్డాక యథావిధిగా ఎండల తీవ్రత పెరుగుతుందని.. తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తాత్కాలికమేనని స్పష్టంచేసింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాచారం, గోల్కొండ, హయత్‌నగర్, సూర్యాపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో పలుచోట్ల 8 సెంటీమీటర్లు, మరికొన్నిచోట్ల 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. భీందేవపల్లి, ధర్మాసాగర్, మెదక్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కూసుమంచి, జగిత్యాల్, తిమ్మాపూర్, మధిర, ముస్తాబాద్, మోర్తాడ్ తదితర చోట్ల 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది.



 జూన్ రెండు లేదా మూడో వారంలో రుతుపవనాలు..

 వచ్చే నెల ఒకట్రెండు తేదీల్లో కేరళను రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ తర్వాత రెండు లేదా మూడో వారంలో రుతుపవనాలు తెలంగాణను తాకుతాయన్నారు. మరోవైపు ఈదురుగాలులు, వడగళ్లు, భారీ వర్షాల కారణంగా ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జిల్లా కలెక్టర్ల నుంచి నష్టం అంచనాకు సంబంధించిన నివేదికను విపత్తు నిర్వహణ శాఖ కోరింది. అయితే ఖమ్మం జిల్లా మినహా ఏ జిల్లా నుంచి కూడా సమాచారం రాలేదని ఆ శాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో ఎటువంటి నష్టం సంభవించలేదని ఆ జిల్లా కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారని వివరించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top