‘హాక్-ఐ’లో మరో హంగు

‘హాక్-ఐ’లో మరో హంగు


- బాధితులు, ఫిర్యాదుదారుల లొకేషన్ ఇండికేషన్ ..

- కదులుతున్నా... తెరపై కనిపించేలా ఏర్పాటు

 

 ఆపదలో ఉన్నా... కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా... పోలీసులకు సంబంధించిన సమాచారం కావాలన్నా... వారికి ఫిర్యాదు చేయాలన్నా ఉపకరించేలా నగర పోలీసు విభాగం రూపొందించిన మొబైల్ యాప్ ‘హాక్-ఐ’లో మరో హంగు చేరింది. అత్యవసర సమయాల్లో సహాయం కోరడం కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ బటన్ ‘ఎస్‌ఓఎస్’కు లొకేషన్ తెలుసుకునే సౌకర్యం ఏర్పాటైంది. ఈ యాప్ ద్వారా ‘డయల్-100’కు కాల్ చేసినా ఇది వర్తించేలా రూపొందించారు. శుక్రవారం నుంచి ఇది ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. కాగా, ఇప్పటివరకు ‘హాక్-ఐ’ యాప్‌ను రెండు లక్షల మంది మొబైల్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.    - సాక్షి, హైదరాబాద్

 

 ఏమిటీ ఎస్‌ఓఎస్..?

 ‘హాక్-ఐ’ యాప్‌లో ఉన్న ఆప్షన్స్‌లో ఎస్‌ఓఎస్ ఒకటి. అత్యవసర సమయాల్లో మీట నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపకరించే వర్చువల్ ఎమర్జెన్సీ బటన్ ఇది. ఈ ఆప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్ నంబర్ వంటివి ఎంటర్ చెయ్యాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భావిస్తున్నామో వారి నంబర్లు సైతం పొందుపరచాలి. గరిష్టంగా ఐదుగురి సెల్‌ఫోన్ నంబర్లు ఎంటర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అవుతుంది.  

 

 ఇదెలా పనిచేస్తుంది..?

 తాజాగా ‘హాక్-ఐ’ యాప్‌ను నగర పోలీసు ఐటీ సెల్ జీపీఎస్ పరిజ్ఞానంతో అనుసంధానించింది. దీంతో ఇకపై ఎవరైనా ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్నీ తెలుసుకునే అవకాశం ఏర్పడింది. గతంలో ఈ సౌకర్యం లేదు. నగరంలోని ఐదు జోన్లలో ఉన్న జోనల్ కంట్రోల్ రూమ్స్‌తో పాటు ప్రధాన కంట్రోల్‌రూమ్, హాక్-ఐ కంట్రోల్ రూమ్స్‌లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎస్‌ఓఎస్ నొక్కిన వెంటనే వీటిపై ఉండే నగర మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది ‘హాక్-ఐ’ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్ వస్తుంది. బాధితుడు ఎటైనా సంచరిస్తున్నా... ఫిర్యాదు క్లోజ్ అయ్యే వరకు తెరపై ఆ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘హాక్-ఐ’ మార్క్‌ను క్లిక్ చేస్తే బాధితుల పేరు, ఫోన్ నంబర్ డిస్‌ప్లే అవుతాయి. ఆ సమీపంలోని రక్షక్ వాహనం సైతం కనిపించడంతో దానికి ఆ సమాచారం ఇచ్చి వెంటనే బాధితుడు ఉన్న ప్రాంతానికి మళ్లిస్తారు.

 

 ‘100’కూ వర్తింపు..

 ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా ‘100’కు నేరుగానే కాకుండా... ఈ యాప్ ద్వారానూ సంప్రదించే ఆస్కారం ఏర్పడింది. హాక్-ఐ ద్వారా కాల్ చేస్తే... ఫిర్యాదుదారుల లొకేషన్ సైతం ఎస్‌ఓఎస్ వినియోగించిన వారి మాదిరిగానే కంట్రోల్ రూమ్స్‌లో స్క్రీన్స్‌పై కనిపించేలా సిటీ పోలీసు ఐటీ సెల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న దీన్ని వినియోగంలో వచ్చే ఇబ్బందుల్ని గమనించడం ద్వారా అవసరమైన మార్పుచేర్పులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘హాక్-ఐ’ యాప్ నగర పోలీసులకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top