మరో 5 విమానాశ్రయాలు..

మరో 5 విమానాశ్రయాలు..


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాడుకలో ఉన్న 8 విమానాశ్రయాలకు తోడు మరో ఐదు చోట్ల కొత్త విమానాశ్రయాలను నిర్మించాల్సిన అవసరముందని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని సూచించింది. పుట్టపర్తి, కడప, రాజమండ్రి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కుప్పం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలలో విమానాశ్రయాల ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించిన విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు.

 

ఇక రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన, కొత్తగా నిర్మించే పోర్టుల నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు రోడ్డు, రైల్వే మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని కమిటీ సూచించింది. విశాఖపట్నం మేజర్ పోర్టు, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ పోర్టులతో పాటు.. నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం, మేఘవరం, నక్కపల్లి, కాకినాడ ఎస్‌ఈజెడ్ పోర్టులను అభివృద్ధి చేసుకోవడానికి.. అలాగే ప్రతిపాదనల్లో ఉన్న కళింగపట్నం, భావనపాడు, దుగ్గరాయపట్నం, రామయపట్నం, భీమునిపట్నం, నర్సాపురం వంటి ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

 

గోల్డెన్ క్వార్డీలేటరల్ ప్రధాన రహదారితో పాటు ఉత్తర  - దక్షిణ కారిడార్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రహదారి మార్గం అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పెరిగే అవసరాల దృష్ట్యా అన్ని ప్రధాన రహదారులను విస్తరించాల్సిన అవసరముందని పేర్కొంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top