దుమ్ము దుమారం!

దుమ్ము దుమారం!


గ్రేటర్‌లో ఏటేటా పెరుగుతోన్న వాయు కాలుష్యం

శ్వాసకోశ వ్యాధులతో జనం సతమతం

అధ్వానంగా మారిన రోడ్లతోనే అసలు సమస్య

కాలం చెల్లిన వాహనాలు, నిర్మాణ పనులు కూడా




గ్రేటర్‌లో వాయు కాలుష్యం సిటీజన్ల ముక్కు పుటాలను అదరగొడుతోంది. ప్రధాన రహదారులపై ఎగిసిపడుతున్న దుమ్ము తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోంది. మట్టికొట్టుకు పోయిన రోడ్లు..పెరుగుతున్న వాహనాలు, మెట్రో పనులు, నిర్మాణ కార్యకలాపాలు,  కాలంచెల్లిన వాహనాల కారణంగా నగరం తరచు ధూళిమయం అవుతోంది. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రో గ్రాములు మించరాదు. కానీ నగరంలో చాలా చోట్ల సరాసరిన 90 నుంచి 100 మైక్రోగ్రాముల మేర ధూళిరేణువులు నమోదవుతుండడం గమనార్హం.    – సాక్షి, సిటీబ్యూరో



సిటీబ్యూరో: గ్రేటర్‌లో వాయు కాలుష్యం సిటీజన్ల ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రధాన రహదారులపై ఎగిసిపడుతోన్న దుమ్ము తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోంది. గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ప్రతిసారీ రోడ్లపై ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. మహానగరం పరిధిలో కాలుష్య స్థాయిలు ఏటేటా పెరుగుతూనే ఉండడం సిటీజన్లను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్నేళ్ల వార్షిక సగటును పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. పెరుగుతోన్న వాహనాలు, అధ్వాన్న రహదారులకు తోడు కాలంచెల్లిన వాహనాలు, మెట్రో పనులు, నిర్మాణ కార్యకలాపాలతో నగరం తరచూ ధూళిమయం అవుతోంది. 



మహానగరంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. ఇందులో సుమారు 10 లక్షల వరకు పదిహేనేళ్లకు పైబడిన కాలంచెల్లిన కార్లు,జీపులు,బస్సులు,ఆటోలున్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న పొగలో ధూళిరేణువులు,సల్ఫర్‌ డయాక్సైడ్,నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి కాలుష్యకారకాలు ఊపిరి సలపనీయడంలేదు. నగరంలో పలు ప్రాంతాల్లో పరిమి తికి మించి ధూళి కాలుష్యం నమోదవుతుం డడం ఆందోళన కలిగిస్తోంది. ఘనపు మీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రో గ్రాములు మించరాదు. కానీ నగరంలో చాలా చోట్ల సరా సరిన 90 నుంచి 100 మైక్రోగ్రాముల మేర ధూ ళిరేణువులు నమోదవుతుండడం గమనార్హం.



అవధులు మించిన వాయు కాలుష్యం...

గ్రేటర్‌లో బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్‌పల్లి, సైనిక్‌పురి, నాచారం, ఆబిడ్స్, జూపార్క్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళికాలుష్యం ప్రతి ఘనపు మీటరు గాలిలో తరచూ వంద మైక్రోగ్రాములు మించడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు ఈ ధూళికాలుష్యంతో అస్తమా, సైనస్, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు.



ప్రధాన కారణాలివే..

►మెట్రో పనులతోపాటు నగర రహదారులపై నిత్యం విద్యుత్, మంచినీరు, రహదారుల నిర్మాణం, టెలీఫోన్‌ కేబుల్స్‌కోసం జరుపుతున్న తవ్వకాలు ధూళికాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం.  

►జలమండలి, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌æ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తిచేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీంతో తరచూ ధూళిమేఘాలు కమ్ముకుంటున్నాయి.

►పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు అలాగే వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం మరింత పెరుగుతుందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

►వాహనాల వేగానికి రహదారులపై పైకి లేచే దుమ్ము, ధూళి, ట్రాఫిక్‌ జాంలో చిక్కుకున్న డీజిల్‌ వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా కూడా ధూళి కాలుష్యం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.



ఏటేటా పెరుగుతోన్న వాయు కాలుష్యం..

నగరంలోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ,పరిశోధన సంస్థ(ఈపీటీఆర్‌ఐ)తాజా అధ్యయనం ప్రకారం నగరంలో ఏటేటా ధూళికాలుష్యం పెరుగుతూనే ఉందన్న విషయం స్పష్టమవుతోంది. పరిమితుల ప్రకారం ఘనపు మీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ వార్షిక సగటు గతేడాది చివరినాటికి 94 మైక్రోగ్రాములకు చేరుకోవడం గమనార్హం. కాగా సిటీలో ఇప్పటికే వాహనాల కాలుష్యం కూడా తీవ్రస్థాయికి చేరింది. దాదాపు 50 లక్షల వాహనాలు సిటీ ఉన్నాయి. వీటి వల్ల గాలిలో  హానికారక రేణువులు పెరుగుతున్నాయి.



అనర్థాలివే..

►ధూళి కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాసకోస సంబంధ వ్యాధులు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి.

►ఆస్తమా, బ్రాంకైటీస్, హైబ్లెడ్‌ ఫ్రెషర్, ఊపిరితిత్తుల వద్ధి రేటు తగ్గిపోవడం తదితర వ్యాధులతో జనం సతమతమవుతున్నారు.

►నగరంలోని పలు ఆసుపత్రులకు వచ్చే 90 శాతానికి పైగా రోగులు ధూళికాలుష్యం బారిన పడుతున్నవారేనని వైద్యులు చెబుతున్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top