రాష్ట్రాన్ని విపత్తుల ప్రాంతంగా గుర్తించాలి


ఏపీ శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం



సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విపత్తుల కేంద్రంగా గుర్తించి తీర్మానం చేయాలని శనివారం శాసనమండలిలో సభ్యులు తీర్మానించారు. హుద్‌హుద్ తుపాను నష్టంపై సంక్షిప్త చర్చలో మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తరచూ తుపాను తాకిడికి గురవుతున్న ఏపీని విపత్తుల ప్రాంతంగా పరిగణించాలని కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం పంపాలని ప్రతిపాదించగా అన్ని పార్టీలకు చెందిన సభ్యు లు మద్దతు పలికారు. అనంతరం మండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ తుపాను నష్టంపై ప్రభుత్వం ముందుగా అంచనా వేయటంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.



సాయం చేస్తామన్న కేంద్రం మొండి చెయ్యి చూపితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని వామపక్ష పార్టీకి చెందిన సభ్యుడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. 125 ఏళ్లలో రాష్ట్రంలో 77 పెద్ద తుపానులు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయని ఇప్పటికైనా శాశ్వత పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తుపాను బాధితులకు పంపిణీ చేయాల్సిన నిత్యావసర సరుకులను కూడా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దోచుకోవడం దురదృష్టకరమన్నారు. మడ అడవుల్లో కలపను అక్రమంగా తరలించడం వల్లే తుపాను విశాఖపై ప్రభావం చూపిందని  ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు.

 

జాతీయ విపత్తుగా ప్రకటించాలి

హుద్‌హుద్‌పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం


సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్ర పునర్నిర్మాణానికి పూర్తి తోడ్పాటు అందించాలని, హుద్‌హుద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. విరాళాలు ఇచ్చిన దాతలు, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపింది. ఈమేరకు హోం మంత్రి చినరాజప్ప ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.  



తుపాను బీభత్సం సమాచారం అందిన వెంటనే స్పందించి తక్షణమే సందర్శించి కేంద్ర బృందాన్ని పంపిన ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.  జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తి తోడ్పాటు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ హోం మంత్రి-ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని శాసనసభ  ఆమోదించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top