గ్రూప్-2 సిలబస్ ఖరారు


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 750  గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి సిలబస్‌ను కమిషన్ ఖరారు చేసింది. గత సిలబస్‌లోని పునరుక్తులను తొలగించడంతో పాటు తాజా పరిణామాలకు సంబంధించిన అంశాలను ఇందులో జోడించారు. ఈ సిలబస్‌పై సబ్జెక్టు నిపుణుల కమిటీలు సమర్పించిన నివేదికలను ఏపీపీఎస్సీ ఆమోదించింది.



 ఏపీపీఎస్సీ పాలకవర్గ సమావేశం గురువారం హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో జరిగింది. చైర్మన్ ఉదయభాస్కర్, సభ్యులు సీతారామరాజు, ప్రొఫెసర్ గుర్రం సుజాత, ప్రొఫెసర్ జి.రంగజనార్దన, కె.విజయకుమార్, ప్రొఫెసర్ కె.పద్మరాజు , రూప ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ 750 పోస్టుల భర్తీకి గతంలో ఏపీపీఎస్సీ సిలబస్ రూపొందించింది. రాష్ట్ర విభజన తదితర పరిణామాలు చేర్చి పాత సిలబస్‌కు కొన్ని మార్పులు, చేర్పులు చేసి.. కొత్త సిలబస్‌ను తన అధికారిక వెబ్‌సైట్లో కమిషన్ పొందుపర్చింది.



 దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.దీంతో  ఆ సిలబస్‌లో మార్పులకు వీలుగా సబ్జెక్టులు, పేపర్ల వారీగా నిపుణుల కమిటీలను నియమించింది. అవి  మార్పులు సూచిస్తూ నివేదికలు ఇచ్చాయి. వీటిని ఏపీపీఎస్సీ పాలకవర్గ సమావేశం ఆమోదించింది. పునరుక్తులు తొలగించడంతో పాటు జాతీయస్థాయి తాజా పరిణామాలు చేర్చినట్లు చైర్మన్ వివరించారు. సిలబస్ ఖరారవ్వడంతో ఈనెలాఖరులోగా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలచేయడంలోని సాధ్యాసాధ్యాలపై చర్చించారు. నోటిఫికేషన్‌తోపాటే సిలబస్‌ను వెల్లడిస్తారు.



 తప్పు ప్రశ్నలకు అందరికీ మార్కులు

 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఇటీవల 2011 గ్రూప్1 మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించడం తెలిసిందే. ఈ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలపై అభ్యంతరాలు వచ్చాయి.  పేపర్-5లో సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయి.  మరికొన్ని తప్పుగా వచ్చాయి. ఈ అభ్యంతరాలు నిజమేనని నిపుణుల కమిటీ నివేదించింది. వాటికి గాను కొన్ని ప్రశ్నలను తొలగించాలని, కొన్నింటికి అందరికీ మార్కులు ఇవ్వాలని  నిర్ణయించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top