తెలంగాణపై అమిత్‌షా గురి..!

తెలంగాణపై అమిత్‌షా గురి..! - Sakshi


సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ బలోపేతంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో ఒకసారి, జూన్ మొదటివారంలో మరోసారి రాష్ట్రానికి రానున్నారు. దక్షిణాదిన పార్టీ ఎదగడానికి తెలంగాణ రాష్ట్రంలోనే అవకాశం ఉందని కమల దళం భావిస్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలనుగురువారం నుంచి జూన్ 15 దాకా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అమిత్‌షా ముందుగా ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. జూన్ మొదటి వారంలో రెండోసారి రాష్ట్రానికి వస్తారు.



తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి విస్తృతమైన అవకాశాలున్నాయని, దానికి అనుగుణంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయడానికి అమిత్‌షా ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా గ్రామాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. కిసాన్ బీమా పథకం ద్వారా రైతులకు జరుగుతున్న మేలు, రైతాంగం కోసం కేంద్రం తెచ్చిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని పార్టీ నేతలు చెపుతున్నారు. రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలను, ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఉదాహరణలతో పాటు పల్లెల్లో ప్రచారం చేస్తామని వెల్లడించారు.



‘ఊరూరా బీజేపీ-ఇంటింటా మోదీ’ నినాదంతో రాష్ట్రంలో 8 బృందాలు పర్యటిస్తాయి. వీటిలో 16 మంది కేంద్ర మంత్రులు, ఏడుగురు పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పని విభజన, వ్యూహంపై చర్చించడానికి రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి,ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డి, ఆచారి తదితరులు పాల్గొన్నారు.



 కేంద్రంపై అనవసర విమర్శలు...

 ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైన, అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. దీనిని తిప్పికొట్టడంతో పాటు కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అసోం తరహాలో తెలంగాణలోనూ పార్టీని అధికారంవైపు నడిపిస్తామని రాంచందర్‌రావు చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top