ఉపాధి @ అమీర్‌పేట్

ఉపాధి @ అమీర్‌పేట్ - Sakshi


అమీర్‌పేట్...కేరాఫ్ అమెరికా! ఔను...ఏ మారుమూల గ్రామం నుంచి ఎవరైనా ‘సాఫ్ట్’గా అమెరికా వెళ్లారంటే వయా అమీర్‌పేటే. ఇక్కడ ‘శిక్షణ’ పునాది వేసుకుంటే అమెరికా ప్రయాణం ఖాయమైనట్టు. యువతను సానబెడుతూ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలను తయారుచేసే కేంద్రం అమీర్‌పేట్ అంటే అతిశయోక్తి కాదు. వాణిజ్య, వ్యాపార, విద్యా, రెసిడెంట్స్.. ఇలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో విరాజిల్లుతోంది. ఒక నగరం.. ఒక రాష్ర్టం.. ఒక ప్రాంతంతో నిమిత్తం లేకుండా అంతర్జాతీయంగా ఇక్కడి నుంచి లావాదేవీలు జరుగుతుంటాయి. ‘అమీర్’పేటను నమ్ముకుంటే అమీరులవుతారని అంటుంటారు కొందరు. అందుకేనేమో అందరి చూపు ఇటు వైపే. చిరువ్యాపారి నుంచి కోట్లలో వ్యాపారాలు చేసే వారికి ఈ ప్రాంతం ఓ వేదిక. నిరుపేద నుంచి సంపన్నవర్గాల వరకు అవసరమైన ప్రతి వస్తువూ ఇక్కడ లభ్యమవుతోంది.                    - సనత్‌నగర్

 

నల్లభై ఏళ్ళ క్రితం అమీర్‌పేట ఒక మామూలు ప్రాంతం. పల్లెటూరు వాతావరణం దాని సొంతం. అక్కడక్కడ విసిరేసినట్లుగా ఉండే పెంకుటిల్లు. హోయ్...హోయ్...అంటూ గేదెల చావిళ్ల వద్ద సవ్వడి...అక్కడక్కడ చిన్న చిన్న దాబాలు...రారమ్మని ఆహ్వానించే ఢిల్లీ మిఠాయి దుకాణం...ప్రధాన రోడ్డు పక్కనే ఉడిపి హోటల్..సమీపంలో కూడా కంటికి కనిపించని ఎర్రబస్సులు...బస్సు కూడా దూరని దారులు...విజయలక్ష్మి గుడి.. శీష్ మహల్ థియేటర్...ఇవీ 40 ఏళ్ల క్రితం అమీర్‌పేట్‌లోని దృశ్యాలు. అంతకమునుపే అమీర్‌పేట్ కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. క్రమేపీ రూపురేఖలు మార్చుకుంటూ వచ్చింది. భాగ్యనగరానికి సెంటర్ పాయింట్ అయ్యింది. నగరం నడిబొడ్డున ఉండడం చేత అమీర్‌పేట దశ మారింది. అలనాడు పచ్చదనంతో నిండిన అమీర్‌పేట్ ఇప్పుడు జనాల సందడితో బిజీగా మారిపోయింది.

 

అన్ని రంగాలకు కేంద్ర బిందువుగా..


నెమ్మది నెమ్మదిగా పెంకుటిళ్లు మాయమయ్యాయి. ఆకాశహారా్మ్యాలను తలపించే భవన సముదాయాలు వెలిశాయి. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అనువైన ప్రాంతంగా మారింది. ఒక్కొక్కటిగా కార్పొరేట్ సంస్థలు పాగా వేశాయి. పేరెన్నికగన్న వస్త్ర దుకాణాలు, ఆటోమొబైల్స్, హోటల్స్, విద్యా సంస్థలు, పారిశ్రామికం, సాఫ్ట్‌వేర్, సూపర్ మార్కెట్లు, ట్రాన్స్‌పోర్ట్ ఇలా అన్ని రంగాల వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ వచ్చారు. ఆయా రంగాల్లో శిక్షణ, ఉద్యోగం, ఉపాధి  కోసం వచ్చే వారికి సందడిగా ఉంటుంది.  

 

 

చిరువ్యాపారాలకు కేరాఫ్‌గా...

ఒకవైపు బడా వ్యాపారుల కల్చర్...మరోవైపు చిరువ్యాపారుల బతుకుబండిని అమీర్‌పేట్ నడిపిస్తోంది. చాయ్...చాట్...చైనీస్ ఫుడ్....టిఫిన్ బండ్లు...ఇలా ఎన్నో రకాల చిరు వ్యాపారాలకు అమీర్‌పేట్ సెంటర్ అయ్యింది. ఇక్కడకు సామాన్యుడి నుంచి కుబేరుల వరకు వచ్చి రుచులను ఆస్వాదిస్తూనే ఉంటారు. సాయంత్రమైందంటే ఆయా సెంటర్ల వద్ద సందడి అంతా ఇంతా కాదు. ఈ చిరువ్యాపారాలు కోట్లలో ఉంటాయన్నది సుస్పష్టం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top