బాబు బావమరిది, తమ్ముడికే పిచ్చి

బాబు బావమరిది, తమ్ముడికే పిచ్చి - Sakshi


చంద్రబాబుకే పారనోయా ఉంది

టీడీపీ మంత్రులపై వైఎస్సార్‌సీపీ నేత అంబటి ధ్వజం

దమ్ముంటే చంద్రబాబును వైద్య పరీక్షలకు పంపాలి

ఆయనకు ఏ రోగం లేదని డాక్టర్లు చెబితే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా..


 

సాక్షి, హైదరాబాద్: మానసిక పరిస్థితి బాగోలేక పిచ్చితో బాధపడుతున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు, బావమరిది నందమూరి బాలకృష్ణలేనని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘పిచ్చి అనేది వంశ పారంపర్యంగా వస్తుంది. వాస్తవానికి చంద్రబాబు వంశంలోనే, వారి బంధువులకే పిచ్చి ఉంది.



దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వంశంలో ఎక్కడా, ఎవరికీ పిచ్చి లేదు, మానసిక వ్యాధులు అసలే లేవు’ అని అంబటి స్పష్టం చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘పారనోయా వ్యాధి ఉన్నదెవరికి? ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చండి అని చెప్పిన జగన్‌కు ఉందా? లేక ప్రపంచానికే పాఠాలు చెప్పానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబుకా? అసలు ప్రపంచం ఎంత? దాని ముందు చంద్రబాబు ఎంత?’ అని అంబటి ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్దానాలు, దొంగమాటలను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించినంత మాత్రాన తానే ఈ రాజ్యాన్ని, ప్రపంచాన్ని పాలిస్తున్నాననే భ్రమల్లో ఉన్న బాబుకు పారనోయా వ్యాధి ఉంది తప్ప జగన్‌కు కాదన్నారు.



జగన్‌పై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి తాబేదార్లు, టీడీపీ మంత్రులకు దమ్ముంటే చంద్రబాబును వైద్య పరీక్షలకు పంపడానికి సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఆయనకు ఏ జబ్బులు లేకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్నారు. అలాగే జగన్‌ను కూడా వైద్య పరీక్షలకు పంపుదామని ఆయన సంపూర్ణంగా ఆరోగ్యవంతుడని నివేదికలు రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమేనని అంబటి పేర్కొన్నారు. తన సవాలుకు నిలబడే దమ్మూ, ధైర్యం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్రకు ఉందేమో కచ్చితంగా సమాధానం చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు.

 

బాలకృష్ణకు పిచ్చి అని అందరికీ తెలుసు

‘జగన్‌కు వ్యతిరేకంగా తన వందిమాగధులతో మాట్లాడిస్తున్న చంద్రబాబు ఒక విషయం గమనిస్తే మంచిది. ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణకు మానసిక పరిస్థితి బాగాలేదని 2004లోనే వైద్యులు పుంఖానుపుంఖాలుగా నివేదికలు ఇచ్చారు. అప్పట్లో బాలకృష్ణ తన ఇంట్లో ఒక సినీ నిర్మాత, ఒక జ్యోతిష్యుడిపై కాల్పులు జరిపితే గాయాలయ్యాయి.



ఒక హోంగార్డు కూడా హతమయ్యారు. ఎందుకిలా కాల్పులు జరిపారంటే ఆయన మానసిక స్థితి బాగోలేదన్నారు. ఈ విషయాన్ని బాబు కూడా అంగీకరించారు. ఆయన తీవ్రమైన నిస్పృహతో ఉన్నారని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి నిమ్స్, కేర్, ఎర్రగడ్డ ఆసుపత్రుల నుంచి ప్రత్యేక వైద్య బృందాలతో నెలల తరబడి వైద్యం చేయించిన విషయం చంద్రబాబు మరిచారా? బాలకృష్ణకు పిచ్చి ఉందనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం’ అని అంబటి దుయ్యబట్టారు.



పిచ్చి తన బావమరిదికి ఉంటే ఉండొచ్చు కానీ వంశపారంపర్యం అంటూ తమకు ఆపాదిస్తారేమిటని బాబు ప్రశ్నించవచ్చుననీ.. అయితే ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడుకు మతి స్థిమితం లేక ఇవాళ ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉందా.. లేదా? ఒకసారి ఆలోచించాలన్నారు. స్వయానా ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడి మానసిక స్థితి బాగాలేకుంటే ఎదుటివారికి పిచ్చి ఉందని చెప్పడం ఏమిటని ఆయన  ప్రశ్నించారు. పిచ్చి అనేది మనిషికి భగవంతుడు ఇచ్చిన దుర్మార్గమైన శాపమనీ, ఇలాంటి దానిపై వ్యాఖ్యానించడం బాధాకరమే అయినా.. జగన్‌ను కించపర్చేలా బాబు తాబేదార్లు విమర్శిస్తున్నందుకే తామిలా మాట్లాడక తప్పని పరిస్థితి వస్తోందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.

 

చంద్రబాబుదే ఉన్మాదం

జపాన్‌లో ఉండికూడా తన తాబేదార్లతో జగన్‌పై బురద జల్లిస్తున్న చంద్రబాబే ప్రజల్లోకి వెళ్లినపుడు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని అంబ టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహచర మంత్రులను యూజ్‌లెస్ ఫెలోస్ అని, చోడవరంలో రైతులను వేస్ట్ ఫెలోస్ అని నిందించింది, హుద్‌హుద్ బాధిత మహిళలు నిలదీస్తే  అహం దెబ్బతిని కస్సుబుస్సులాడిందీ.. చంద్రబాబేనని ఆయన విమర్శించారు. ప్రజలను ఆప్యాయంగా పలుకరించే మనస్తత్వం ఉన్న జగన్‌పై విమర్శలు చేయించడం బాధాకరమన్నారు.



‘వాస్తవానికి చంద్రబాబును చూస్తేనే అర్థం అవుతుంది ఆయనెంత ఆరోగ్యంగా ఉన్నాడో, మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో అనేది. ఆయనేమైనా మచ్చలేని చంద్రుడా? అనే విషయం ఆయన వందిమాగధులు గుర్తిస్తే మంచిది..’ అని రాం బాబు ఎద్దేవా చేశారు. బాబు కనుక ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజ లు రాళ్లతో కొట్టే రోజొస్తుందని ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో జగన్ హెచ్చరిస్తే.. దానికి ఆయనపై ఇంత దాడి చేస్తారా? అని ప్రశ్నించా రు. వాగ్దానాలు నెరవేర్చి,  ప్రజల మన్ననలు పొందాలని ప్రతిదాడికి దిగడం ప్రజాస్వామ్యం లో సరికాదన్నారు. జగన్ చేసిన విమర్శలను రాజకీయంగా ఘాటైనవిగా చూడా లే తప్ప ప్రజలు నిజంగా రాళ్లేస్తారని అర్థం కాదన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top