‘హోదా’పై వైఖరి చెప్పండిబాబూ..

‘హోదా’పై వైఖరి చెప్పండిబాబూ.. - Sakshi


♦ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

♦ ‘హోదా’ లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినా మాట్లాడరేం?

♦ కేంద్రంలో పదవులూ... స్వార్థ రాజకీయాలే మీకు ముఖ్యమా?

♦ చంద్రబాబుపై అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ ధ్వజం

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తన వైఖరేమిటో ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నోరుతెరిచి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమే లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వకంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాకైనా చంద్రబాబు తన వైఖరేంటో ఎందుకు చెప్పట్లేదని నిలదీసింది. ఇప్పటికైనా కేంద్రానికి ఎందుకు అల్టిమేటం ఇవ్వరని ప్రశ్నించింది. ఈ మేరకు పార్టీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ బుధవారం సాయంత్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఐదుకోట్ల మంది రాష్ట్రప్రజల భవిష్యత్తుకన్నా చంద్రబాబుకు తనపైనున్న కేసులు, కేంద్రంలో మంత్రిపదవులు, స్వార్థ రాజకీయాలే ముఖ్యమా? అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని చంద్రబాబు పోరాటమైనా చేయాలి లేదా ప్రత్యేక హోదా అక్కర్లేదని, దాన్ని తాను సాధించలేనని ప్రజల ముందుకొచ్చి చెంపలైనా వేసుకోవాలని వారు సూచించారు. ‘హోదా’ రాకపోవడానికి కారణం చంద్రబాబు మెతక వైఖరేనన్నారు.



 రాష్ట్ర ప్రజల్ని బీజేపీ, టీడీపీలు రెండూ మోసగించాయి..

 రెండేళ్లుగా ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు రెండూ దాగుడుమూతలాడుతూ రాష్ట్రప్రజల్ని దారుణంగా మోసగించాయని వారు మండిపడ్డారు. ‘హోదా’ నిర్ణయం ఇంతకాలం నీతిఆయోగ్ పరిశీలనలో ఉందని నమ్మబలుకుతూ వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబులు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు.ఓవెపు కేంద్రంలో తన పారీవారిని ఇద్దర్ని మంత్రులుగా కొనసాగిస్తూ, మరోవైపు బీజేపీకి చెందిన ఇద్దర్ని రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగిస్తున్న చంద్రబాబు కేంద్రంపై రాజీలేని పోరాటం ఎలా చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇవాళ తన కేసులకోసం, తన రాజకీయ స్వార్థప్రయోజనాలకోసం రాష్ట్ర పరువును ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారని అంబటి, వాసిరెడ్డి ధ్వజమెత్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top