ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేస్తున్నారు : బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేస్తున్నారు : బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు అమ్మకానికి పెట్టారని, స్విస్ చాలెంజ్ విధానం వెనుక వేల కోట్ల దోపిడీ ఉందని శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాల క్రితం సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు తరిమెల నాగిరెడ్డి ‘తాక ట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని రచించారని ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చూస్తూంటే ‘ఏపీ అమ్ముడు పోయింది’ అనే పుస్తకం రాయాల్సినంతగా ఉన్నాయని అన్నారు. అసలది స్విస్ చాలెంజ్ కాదు, ఒక పథకం ప్రకారం చేస్తున్న పని అని, దీన్ని ‘చంద్రన్న చాలెంజ్’ అనడం మేలన్నారు.

 

పూచీకత్తు లేకుండా అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఏర్పాటు చేసిన సంస్థలో 58 శాతం సింగపూర్ కన్సార్టియంకు, 42 శాతం ఏపీ ప్రభుత్వానికి వాటాలు ఉండటంతోనే విదేశీ కంపెనీలకు దాసోహమయ్యారనే విషయం తెలుస్తోందన్నారు. ఏ కారణం చేత రాజధాని నిర్మాణం ఆగినా అందుకు చెల్లించాల్సిన మొత్తాలకూ బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని రాసుకోవడం విచిత్రమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు స్విస్ చాలెంజ్‌కు వ్యతిరేకంమనీ, అందులోని నిబంధనలు కూడా అనుసరించలేదన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతి ప్రకారం (అన్‌సొలిసిటెడ్) ఎవరూ కోరకపోయినా.. నిర్మాణాలకు సంస్థలే ముందుకు రావాలని.. కానీ రాష్ట్రమే సింగపూర్ కంపెనీలకు మార్చి 22న లేఖ రాసిందని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top