అమీన్‌పీర్ దర్గాలో 'అల్లరి' నరేష్

అమీన్‌పీర్ దర్గాలో 'అల్లరి' నరేష్


కడప కల్చరల్: ప్రముఖ సినీ నటుడు 'అల్లరి' నరేష్ ఆదివారం కడప నగరంలోని ప్రఖ్యాత పెద్ద (అమీన్‌పీర్) దర్గాను దర్శించుకున్నారు. నరేష్ పూల చాదర్‌లను తలపై ఉంచుకుని దర్గాలోని ప్రధాన గురువుల మజార్ల వద్ద సమర్పించారు. అక్కడ ప్రార్థనల అనంతరం ఆ ప్రాంగణంలోని ఇతర గురువుల దర్గా వద్ద కూడా చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి దర్గా గురువులంటే తనకు ఎంతో విశ్వాసం, నమ్మకముందని, గతంలో రావాలని ప్రయత్నించినా వీలు కాలేదన్నారు. ప్రస్తుతం తాను నటించిన 'జేమ్స్‌బాండ్' సినిమా విజయవంతం కావడంతో దర్గా గురువుల ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. జేమ్స్‌బాండ్‌చిత్రంలో 'సీమ' సంప్రదాయాన్ని కించపరిచిన సందర్భాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా హాస్యం కోసం సన్నివేశం డిమాండును బట్టి అలా చేశామే గానీ సీమ ప్రాంతాన్ని కించపరచాలని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు.



సీమశాస్త్రి, సీమ టపాకాయ్ సినిమాలను 'సీమ' సంప్రదాయానికి అనుగుణంగానే తీశామన్నారు. తన సినిమాలను అన్ని ప్రాంతాల వారి కోసం తీస్తామని అందువల్ల ఏ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తమకు ఉండదన్నారు. అల్లరి నరేశ్ తో పాటు హాస్యనటుడు రఘు తదితరులు కూడా దర్గాను సందర్శించుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top