జస్టిస్‌ కట్జూనూ అరెస్ట్‌ చేయిస్తారేమో!

జస్టిస్‌ కట్జూనూ అరెస్ట్‌ చేయిస్తారేమో! - Sakshi


చంద్రబాబు వైఖరిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎద్దేవా



సాక్షి, హైదరాబాద్‌ : తనను ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ శిక్షించాలనే ధోరణితో ఏపీ సీఎం చంద్రబాబు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నియంతృత్వ పాలనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ కాలిఫోర్నియా నుంచి రాష్ట్రపతి,ప్రధానిలకు సోషల్‌ మీడియా ద్వారా లేఖ రాసినందున ఏపీ పోలీసులను అమెరికాకు పంపించి అరెస్టు చేయించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.



  బుధవారం మధ్యాహ్నం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని అధికరణ19 (1)(ఎ) సబ్‌ సెక్షన్‌ కింద ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని విమర్శించారు.  ప్రభుత్వం వాగ్దానాలను మరచి పోయిందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. కట్జూ లేఖ, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లేఖ, చంద్రబాబు అవినీతిపై ప్రచురించిన ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ వంటి అంశాల ఆధారంగా రాష్ట్రపతి, ప్రధానిలు కనుక 356 అధికరణ ప్రకారం చర్యలు తీసుకుందామనే ఆలోచనకు వస్తే బాబు వారినీ అరెస్టు చేయిస్తారేమోనని భయంగా ఉందన్నారు.



జీఎస్టీ బిల్లుకు వైఎస్సార్‌ సీపీ అనుకూలం

జీఎస్టీ బిల్లుకు ప్రతిపక్షం అనుకూలంగా వ్యవహరించలేదంటూ మంగళవారం శాసనసభ సమావేశం ముగిశాక బాబు ప్రచారం చేయడం అర్థ రహితమని రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభలో వ్యవహరించిన తీరుపై కేంద్రానికి నివేదిక పంపుతామని సీఎం చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని అసెంబ్లీ ప్రారంభానికి ముందు రోజే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్పష్టంగా ప్రకటించా రన్నారు.పార్లమెంటులోనూ తమ సభ్యులు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top