నిమ్స్‌లో ఇక అన్నీ ఉచితం

నిమ్స్‌లో ఇక అన్నీ ఉచితం - Sakshi


♦ వైద్యుడి కన్సల్టేషన్‌సహా పరీక్షలు, శస్త్రచికిత్సలూ ఫ్రీ

♦ తెలంగాణ ఆరోగ్య శ్రీ కార్డుదారులకు మాత్రమే

♦ సర్కారు నిర్ణయం  అందుబాటులోకి వచ్చిన సేవలు

♦ ప్రభుత్వంపై నెలకు రూ.20 కోట్ల భారం

♦ ఏపీ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు 25 శాతం సబ్సిడీ కొనసాగింపు

 

 సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ కార్డుదారులకు శుభవార్త. ఇకపై ప్రతిష్టాత్మక నిమ్స్ (నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) ఆస్పత్రిలో వారికి అన్ని సేవలూ ఉచితమే. వైద్యుడి కన్సల్టేషన్ మొదలుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అన్నీ కూడా ఉచితంగా అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం తెలంగాణలోని ఆరోగ్యశ్రీ కార్డుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ రోగులకు ఇది వర్తించదు. వారికి పాత పద్ధతే కొనసాగుతుంది. ఉస్మానియా, గాంధీ తరహాలోనే ఇక్కడా అమలుకానుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 20 కోట్ల భారం పడనుంది. శనివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.



 75 శాతం చెల్లించాల్సి వచ్చేది

 ఉస్మానియా, గాంధీతో పోలిస్తే నిమ్స్ పూర్తిగా భిన్నం. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ ఇది. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాదిరిగా ఇక్కడ ఉచిత వైద్య సేవలంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు. 1,500 పడకల సామర్థ్యం కలిగిన నిమ్స్ అవుట్‌పేషంట్ విభాగానికి సగటున రోజుకు 2,400 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 40-50 శాతం మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఉంటారు. ఓపీ రోగుల్లో నూటికి 90 శాతం మందికి రక్త, మూత్ర పరీక్షలు అవసరం అవుతుంటాయి. ఉస్మానియా, గాంధీ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు పరీక్షలు ఉచితంగా చేస్తారు. కానీ నిమ్స్‌లో లబ్ధిదారులకు మొత్తం బిల్లుపై 25 శాతం రాయితీపోనూ మిగిలిన 75 శాతం చెల్లించాల్సి వచ్చేది.



ఈ మాత్రం కూడా చెల్లించలేని వారిని గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రులకు పంపేవారు. అప్పటికే చాలామంది ఉండటంతో వ్యాధి నిర్ధారణ పరీక్ష చేసుకుని తీరా రిపోర్టు తీసుకుని వచ్చే సరికి రోగం మరింత ముదిరేది. ఒక్కోసారి రోగులు మృత్యువాత పడేవారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండి ఓపీలో డబ్బులు చెల్లించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న రోగుల్లో ఎవరైనా ఇన్‌పేషంట్‌గా చేరితే.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానం ఇక్కడ అమల్లో ఉంది. ఇలా 2013 నుంచి ఇప్పటివరకు రూ.50 లక్షలు రీఫండ్ చేసినట్లు అధికారులు చెబుతున్నా, రోగుల పేరుతో వీటిని సిబ్బందే కాజేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఇటీవల ‘నిమ్స్‌లో స్వాహాయణం.. రీఫండ్ పేరుతో నిధుల లూటీ’ శీర్షిక పేరుతో ‘సాక్షి’లో కథనం ప్రచురించింది. మంత్రి లక్ష్మారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని నిమ్స్ డెరైక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అన్ని సేవలను ఉచితంగా అందించి ఈ ఆరోపణలకు చెక్‌పెట్టాలని యాజమాన్యం భావించింది.



 ఆ సామర్థ్యం నిమ్స్‌కు ఉందా?

 ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న వ్యాధి నిర్ధారణ యంత్రాలను పద్నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఇతర ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్‌కు రోగుల తాకిడి ఎక్కవ. విరామం లేకుండా పని చేయడం వల్ల ఉన్న చాలావరకు పాడైపోయాయి. ఉన్నవి కూడా తరచూ మొరాయిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన కిడ్నీ, కాలేయ, కేన్సర్ బాధితులు పరీక్షల కోసం ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. రోగులకు ఇది ఆర్థికంగా భారంగా మారడమే కాకుండా ఆస్పత్రికి రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్తోంది. ముందస్తుగా డయాగ్నోస్టిక్ విభాగాన్ని అభివృద్ధి చేయకుండా ఉచిత పరీక్షలు చేయడమేంటని నిమ్స్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 

 ‘ఇన్వెస్టిగేషన్’ను అభివృద్ధి చేస్తాం

  నిమ్స్‌లో ఇప్పటికే రూ.60 కోట్లతో ఆధునాతన పెట్‌సిటి స్కాన్, క్యాథ్ ల్యాబ్, 3.0 టీఎంఆర్‌ఐ, 1.5 టీఎంఆర్‌ఐ, 128 స్లైస్ మల్టీడిటెక్టర్ సీటీస్కాన్, ఎల్‌సీడీ ప్రొజెక్టర్, ఎండోస్కోపి అల్ట్రాస్నోగ్రఫీ, ఆటోమెటెడ్ బ్లడ్ కాంపొనెంట్ సెపరేటర్స్, 3 చిప్ ఎండోస్కోపి కెమెరా, హెచ్‌డీ కెమెరా, అల్యూమినియం ట్రంక్‌బాక్స్‌లతోపాటు మొత్తం 120 వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నాం. జూన్ నాటికి అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరికరాలతో ఇన్వెస్టిగేషన్ విభాగాన్ని పరిపుష్టం చేసి, పేషంట్స్ తాకిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం.

 - డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్, నిమ్స్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top