పారిన ‘ఆకర్ష్’ మంత్రం

పారిన ‘ఆకర్ష్’ మంత్రం - Sakshi


- టీఆర్‌ఎస్‌కు రాజ్యసభ ఎన్నికల్లో కలిసిరానున్న ‘ఫిరాయింపుల’ బలం

- అమాంతంగా పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్య

 విపక్షాలకు పోటీ చేసే అవకాశం లేకుండా ముందస్తు వ్యూహం

టీఆర్‌ఎస్‌కు రెండు రాజ్యసభ స్థానాలు లాంఛనమే

 

 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో బలం పెంచుకునేందుకు గులాబీ దళపతి వేసిన ఎత్తు ఫలించనుంది. రాష్ట్రంలో జూన్ 21న ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు, మరోవైపు విపక్షాలను బలహీనపరిచి మానసికంగా పైచేయి సాధించేందుకు ప్రయోగించిన ‘ఆకర్ష్’ అస్త్రం లక్ష్యం చేరుకున్నట్లే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీల నుంచి 23మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో ఆ పార్టీ బలం పెరిగింది.



ఈ మధ్య జరిగిన రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాలోని సీట్లను కైవసం చేసుకోవడంతో మొత్తంగా టీఆర్‌ఎస్‌కు 25మంది ఎమ్మెల్యేలు జతయ్యా రు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుచుకున్న 63 స్థానాలకు తోడు ఫిరాయింపులు, విలీనం, ఉప ఎన్నికల రూపంలో అందివచ్చిన 25 మందిని కలుపుకొంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 88కి చేరింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రెండు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకోవడానికి అవసరమైన 80 మంది ఎమ్మెల్యేల సంఖ్యకు అదనంగా 8 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ఫలితం చూపించకుండా ఉండి ఉంటే.. ఎంఐఎం మద్దతిచ్చినా టీఆర్‌ఎస్ కేవలం ఒక్క రాజ్యసభ స్థానానికే పరిమితమై ఉండేదని విశ్లేషిస్తున్నారు.



 మారిన ముఖచిత్రం

 2014 సార్వత్రిక ఎన్నికల్లో 17 లోక్‌సభా స్థానాలకుగాను టీ ఆర్‌ఎస్ 13 సీట్లు గెలుచుకుంది. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌కు కేవలం ఒక్క సభ్యు డే ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభతోపాటు రాజ్యసభలోనూ బలం పెంచుకునే దిశలో ఆలోచించారని చెబుతున్నారు.అందుకు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఓటర్లయిన ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడం మినహా మరో మార్గం లేకపోవడం, అందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్ప దగ్గర దారి లేకపోవడంతో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు పదును పెట్టారని అభిప్రాయపడుతున్నారు. పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ టీడీపీ నుంచి ఏకంగా 12 మందిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు.



మెజారిటీ సభ్యులుగా వీరు టీఆర్‌ఎస్‌లో అధికారికంగా విలీనమయ్యారు. 21 మంది సభ్యులున్న కాంగ్రెస్ నుంచి ఆరుగురిని ఆకర్షించారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అకాల మరణం చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రెండు స్థానాలు టీఆర్‌ఎస్ దక్కించుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే ఇద్దరు బీఎస్సీ సభ్యులు టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన మగ్గురు ఎమ్మెల్యేలు సైతం విలీనమయ్యారు. కేవలం ఆపరేషన్ ఆకర్ష్‌తో పెంచుకున్న బలంతో ఇప్పుడు టీఆర్‌ఎస్ రాజ్యసభ స్థానాలను గెలుచుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 విపక్షాలకు పోటీ అవకాశమే లేదు

 విపక్ష పార్టీలకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. రెండేళ్ల కిందటి ఎన్నికల్లో పదిహేను స్థానా లు గెలుచుకున్న టీడీపీ చేతిలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో 21 స్థానాలను గెలుచుకోగా వారిలో ఆరుగురు టీఆర్‌ఎస్‌లో చేరగా.. ఇద్దరు చనిపోయా రు. దీంతో ఆ పార్టీకి మిగిలింది 13 స్థానా లు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నందున ఆ పార్టీకి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క.



బీజేపీ చేతిలో అయిదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఎం, సీపీఐకి ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. పార్టీల సిద్ధాంతాలు, వైరాన్ని పక్కన పెట్టి ఈ మూడు పార్టీలూ ఒక్కటైనా వీరి సంఖ్య 24కు చేరుతోంది. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం అధికార పక్షానికి మిత్రపక్షంగానే ఉంది. మొత్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసినా ఒక రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు అవసరమైన 40 మంది ఎమ్మెల్యేలు లేకుండా అయ్యారు. ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేసేలా కేసీఆర్ అమలు చేసిన వ్యూహం వల్లే వారికి పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top