2014 తర్వాత డిగ్రీలు చెల్లవు!

2014 తర్వాత డిగ్రీలు చెల్లవు!


పలు తత్సమాన కోర్సులపై కేంద్ర ఉత్తర్వులు

- అప్పట్లోనే మార్గదర్శకాలు జారీ.. ఆలస్యంగా వెలుగులోకి..

- టీచర్‌ పోస్టుల భర్తీ నేపథ్యంలో ఢిల్లీ నుంచి తెప్పించిన విద్యాశాఖ

- 129 డిగ్రీలే చెల్లుబాటు.. 2014 తర్వాత వేరే పేర్లతో ఉంటే చెల్లవు

- 16 రకాల డిగ్రీ తత్సమాన కోర్సులు చెల్లవని స్పష్టీకరణ




సాక్షి, హైదరాబాద్‌: తెలుగు పండిత శిక్షణ, ఉర్దూ పండిత శిక్షణ, హిందీ పండిత శిక్షణ... రాష్ట్రంలో ఇటీవలి వరకు కొనసాగిన ఉపాధ్యాయ విద్యా కోర్సులివి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ 2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2014 తరువాత ఆ కోర్సులేవీ చెల్లుబాటు కావు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవి పనికిరావు. ఆ కోర్సులను 2014కు ముందు చేసి, అది కూడా ఎన్‌సీటీఈ గుర్తింపు కలిగి ఉంటే మాత్రమే మినహాయింపు ఉంటుంది.



ఇవేకాదు డిగ్రీతో తత్సమానంగా పేర్కొంటున్న మరో 16 రకాల కోర్సులు కూడా చెల్లుబాటు కావు. ఈ కోర్సులను కూడా 2014కు ముందు చేసి, అప్పట్లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గుర్తింపు ఇచ్చిన డిగ్రీల జాబితాలో ఉంటే మాత్రమే ప్రస్తుతం ఉద్యోగ దరఖాస్తులకు చెల్లుబాటవుతాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా డిగ్రీలన్నీ ఒకేరకంగా ఉండాలని అప్పట్లోనే యూజీసీ స్పష్టం చేసింది. మొత్తంగా 129 రకాల డిగ్రీలు మాత్రమే ఉండాలని, ఈ మేరకు అవసరమైన మార్పులు చేసుకోవాలని విద్యా సంస్థలను ఆదేశించింది కూడా.



విద్యాశాఖ చొరవతో వెలుగులోకి..

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు కొత్త కొత్త పేర్లతో డిగ్రీ తత్సమాన సర్టిఫికెట్లు అంటూ దరఖాస్తు చేస్తున్నారు. అవి సరైన డిగ్రీలా, కాదా? అన్న సందేహం తలెత్తింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఒకేరకమైన డిగ్రీలు ఉండాలంటూ 2014 జూలై 11న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేకపోవడంతో ఏయే డిగ్రీలకు గుర్తింపు ఉందన్న సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా కోర్సులపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నుంచి స్పష్టత తీసుకురావాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. దాంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దీనిపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్యను, పాఠశాల విద్య డైరెక్టర్‌ కిషన్‌ను, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ జగన్నాథరెడ్డిని కలిశారు.



వాస్తవానికి ఈ అంశాన్ని తేల్చాల్సింది ఉన్నత విద్యా మండలి. అయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ జగన్నాథరెడ్డి, ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లి.. తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో డిగ్రీతో తత్సమానంగా పేర్కొంటూ నిర్వహిస్తున్న పలు కోర్సులను యూజీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీలకు యూజీసీ గుర్తింపు లేదని, అవి చెల్లవని అధికారులు తేల్చారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన మరో 7 రకాల డిగ్రీలపై సందేహాలు ఉన్నాయని, దీనిపై ఆయా రాష్ట్రాలతో మాట్లాడి త్వరలో స్పష్టత ఇస్తామని తెలిపారు.



యూనివర్సిటీలకే తెలియని పరిస్థితి!

డిగ్రీల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ యూనివర్సిటీలకే యూజీసీ మార్గదర్శకాలు, డిగ్రీల విషయంలో స్పష్టమైన అవగాహన లేదని.. దాంతో పాత పేర్లతోనే డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయని చెబుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి ఒకే రకమైన డిగ్రీలు ఉండాలన్న మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీల పేర్లను మార్చాల్సి ఉందని పేర్కొంటున్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top