కల్తీపాల దందా గుట్టురట్టు

కల్తీపాల దందా గుట్టురట్టు - Sakshi


నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

 

 సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ కంపెనీల పాలను కల్తీ చేసి... రీ-ప్యాకింగ్‌తో విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్‌గిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నిర్వహిస్తున్న నిందితుడి నుంచి ప్యాకింగ్ మిషన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన డి.అమృతలాల్ 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నేరేడ్‌మెట్‌లోని సాయినగర్‌లో స్థిరపడ్డాడు. ఐదేళ్లుగా హెరిటేజ్ పాల కంపెనీకి డిస్ట్రిబూటర్‌గా పనిచేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లను కొని టీస్టాల్స్, హోటల్స్‌తో పాటు కొన్ని ఇళ్లల్లోనూ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే పాలను నీళ్లతో కల్తీ చేసి, మళ్లీ రీ-ప్యాక్ చేసి విక్రయించడం మొదలుపెట్టాడు.



 కల్తీ తంతు ఇదీ...

 అమృత్‌లాల్ టీ స్టాల్స్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఖాళీ పాల ప్యాకెట్లు సేకరిస్తుంటాడు. రోజూ తెల్లవారుజామున మూడున్నరకల్లా హెరిటేజ్ కంపెనీ నుంచి ఇతడికి 300 నుంచి 400 లీటర్ల పాల ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లను అనుమానం రాకుండా కత్తిరించి, పాలను టబ్‌లో పోస్తాడు. ఇలా తీసిన ప్రతి 50 లీటర్ల పాలలోనూ 100 లీటర్లకు పైగా నీళ్లు కలుపుతాడు. శుద్ధి చేసిన నీరు అందుబాటులో లేకపోతే... ఒక్కోసారి కలుషిత నీటినే వాడేసేవాడు. ఆ పాలను తిరిగి అవే ప్యాకెట్లతో పాటు ముందే తెచ్చుకున్న ఖాళీ ప్యాకెట్లలో నింపి ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ మిషన్లతో సీల్ చేస్తాడు. ఆ ప్యాకెట్లను హోటళ్లు, టీ స్టాళ్లు, ఇళ్లకు బట్వాడా చేయిస్తున్నాడు. సేకరించిన ఖాళీ పాల ప్యాకెట్లలో కొన్ని పాతవి ఉంటే వాటిపై ఉన్న తయారీ తేదీని థిన్నర్ సాయంతో తుడిచేస్తున్నాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ ఎన్‌సీహెచ్ రంగస్వామి నేతృత్వంలోని బృందం దాడి చేసి అమృత్‌లాల్‌ను పట్టుకున్నారు. దాడి సమయంలో 237 పాల ప్యాకెట్లతో పాటు రెండు ప్యాకింగ్ మిషన్లు, మూడు థిన్నర్ బాటిళ్లు, వివిధ కంపెనీలకు చెందిన 100 ఖాళీ పాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

 గతంలోనూ ఇదే తరహాలో

 గతంలోనూ నగర శివార్లలో యూరియా, మంచినూనె కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠానూ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు నగరంలో మరికొన్ని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్యాకెట్ల  సైజ్ కాస్త చిన్నగా ఉంటుందని, ప్యాకెట్లలో ఖాళీస్థలం తక్కువగా ఉంటుందని,  ప్యాకె ట్లపై తయారీ తేదీ చెరిపేసి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ప్యాకెట్లను అనుమానించాలని, వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని అధికారులు విని యోగదారులకు సూచిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top