సేవా ప్రవీణుడు

సేవా ప్రవీణుడు


చదువు కోసం బాలకార్మికుడిగా మారి వేసిన ఆ బుడతడి అడుగులు.. విద్యార్థిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవైపు నడిపించాయి.. అక్కడితో ఆగకుండా.. దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాలుపంచుకునే అవకాశాన్ని అందించాయి. నిరుపేద కుటుంబంలో వికసించిన ప్రవీణ్.. ఇప్పటి వరకు ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచాడు. అదే స్ఫూర్తితో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్రంలోని యూనివర్సిటీల తరఫున ఎంపికైన తొలి విద్యార్థి ప్రవీణ్ కావడం విశేషం.

 ..:: జిలుకర రాజు, సెంట్రల్ యూనివర్సిటీ

 

బాల్యంలో ఆటలు లేవు. స్కూల్‌డేస్‌లో పుస్తకాలతో కుస్తీ.. సాయంత్రాలు పౌల్ట్రీ ఫామ్‌లో కూలి. ఇదీ రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ నేపథ్యం. తండ్రి రోజు కూలి చేస్తేగానీ పూటగడవని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు తన చదువును అటకెక్కిస్తాయన్న బెంగతో.. తనూ కూలీగా మారాడు. ఉదయం పాఠశాలకు వెళ్తూనే.. సాయంత్రాలు పౌల్ట్రీ ఫామ్‌లో పనికి కుదిరాడు.



కోళ్ల వ్యర్థాలను ఎత్తి.. తన బతుకును అర్థవంతంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. తన సంపాదనకు తండ్రి సహకారం తోడవడంతో విద్యార్థిగా ఉన్నత ఫలితాలు సాధిస్తూ ముందుకుసాగాడు. గచ్చిబౌలి నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేసిన ప్రవీణ్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ సీటు (ఎం.ఏ చరిత్ర) కొట్టి పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపించాడు.

 

అలా దిల్లీకి..

 కళాశాల స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచిన ప్రవీణ్.. చదువుతో పాటు సాంస్కృతిక, సేవ కార్యక్రమాల్లో తనదైన మార్క్ చూపించాడు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ సౌత్‌జోన్ రిపబ్లిక్ పరేడ్‌లో తన ప్రతిభ చాటాడు. తాజాగా రిపబ్లిక్ పరేడ్‌లో భాగంగా రాష్ట్రపతికి గౌరవ వందనం అందించే అవకాశం పొందాడు. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతినిధిగా తాను ఎంపికవ్వడం ఆనందంగా ఉందంటూ దిల్లీకి చేరుకున్నాడు ప్రవీణ్.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top