టాలీవుడ్‌ను ఆడిపోసుకుంటున్నారు: నటి

టాలీవుడ్‌ను ఆడిపోసుకుంటున్నారు: జీవిత - Sakshi


హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలంపై నటి జీవిత సీరియస్‌గా స్పందించారు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమను ఆడిపోసుకుంటున్నారని, మిగిలినవారిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. సినీ పరిశ్రమలో ఏదైన సంఘటన జరిగితే దాన్ని అందరికి ఆపాదించి చులకన చేయడం సరికాదన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌ రంగం అని, నటీనటులను ...అభిమానులు అనుకరించే అవకాశం ఉన్నందున ...అందరూ కేర్‌ఫుల్‌గా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. 


డ్రగ్స్‌ వ్యవహారంలో నోటీసులు అందుకున్నవారు అంతా తప్పు చేశారనుకుంటే పొరపాటే అన్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే భవిష్యత్‌లో మళ్లీ జరగకుండా దాన్ని సరిదిద్దుకోవాలని జీవిత సూచించారు. విపత్తులు, ఎలాంటి ఆపదలు ఎదురైనా తెలుగు చిత్ర పరిశ్రమ బాధ్యతాయుతంగా తమవంతు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఒక్క టాలీవుడ్‌నే బాధ్యులుగా పేర్కొనడం సరైంది కాదని జీవిత అభిప్రాయపడ్డారు.  



‘సినిమావాళ్ల గురించి  ఎవరిమీదైనా, ఏదైనా రాయవచ్చనే ధోరణి ఉంది. యూట్యూబ్‌లో చేస్తే తెలుస్తుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. స్కూల్‌ పిల్లల వరకూ డ్రగ్స్‌ పాకాయి. అలాగే ఎప్పటి నుంచో పబ్‌లు, క్లబ్‌ల కల్చర్‌ ఉంది. ఇన్నాళ్లు ఏం చేశారు. ఎంత విచ్చలవిడిగా వదిలేశారు. ఎంతోమంది సొసైటీలో డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. అయితే డ్రగ్స్‌ తీసుకుంటున్నారంటూ కేవలం సినిమావాళ్లను ముందుకు తీసుకురావడం సరికాదు. డ్రగ్స్‌ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.


అలాగే అధికారుల లోపం కూడా ఉంది. సినిమా వాళ్లు డ్రగ్స్‌ తీసుకోవడం లేదని నేను అనడం లేదన్నారు. సినిమా ఇండస్ట్రీ దానికేమీ అతీతం కాదన్నారు.  ప్రతి విషయానికి చిత్ర పరిశ్రమను టార్గెట్‌ చేయడం సరికాదు. పిల్లలను కూడా బలి తీసుకుంటున్న డ్రగ్స్‌పై సమాజం కూడా పోరాటం చేయాలి’ అని జీవిత పిలుపునిచ్చారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top