నమ్మకద్రోహి..

నమ్మకద్రోహి.. - Sakshi


పనిచేసే ఇంటికే కన్నం

విలాసవంతమైన జీవితానికి అలవాటు

విడతల వారీగా చోరీ చేస్తూ దొరికిన డ్రైవర్

రూ.1.37 కోట్ల  సొత్తు చోరీ

రూ.1.25 కోట్ల సొత్తు రివకరీ

నిందితుడితోపాటు సహకరించిన వారు కూడా అరెస్టు

 


సికింద్రాబాద్: ఓ వ్యక్తి డ్రైవర్‌గా ఏడేళ్లు ఒకే ఇంట్లో పనిచేస్తున్నాడు... యజమాని వద్ద నమ్మకాన్ని పెంచుకున్నాడు. అనుమానం రాకుండా ఆ ఇంట్లో విడతల వారీగా చోరీకి పాల్పడుతూ వచ్చాడు. గత రెండు నెలలుగా తన ఇంట్లో నగదు, బంగారం కన్పించకుండా పోతున్న విషయాన్ని యజమాని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా డ్రైవరే దొంగ అని తేలింది. సుమారు రూ.1.37 కోట్ల విలువ చేసే సొత్తు చోరీకి గురైనట్టు తేల్చారు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రూ.1.25 కోట్ల విలువ చేసే నగదు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ జీ.సుధీర్‌బాబు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి...



బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడ్‌బంద్‌లోగల అనంత ఎన్‌క్లేవ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో సంపన్న వర్గానికి చెందిన అజయ్ హరినాథ్ నివాసం ఉంటున్నాడు. అతని వద్ద అదే ప్రాంతంలోని మడ్‌ఫోర్ట్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన మహ్మద్ తహసీన్ (27) ఏడేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. యజమాని వద్ద నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ దశలో విలాసవంతమైన జీవితం గడపాలనుకున్న తహసీన్‌కు తన యజమాని ఇంట్లో చోరీ చేయాలన్న కోరిక కలిగింది. విడతల వారీగా బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, అందినంత నగదును దొంగిలించడం ప్రారంభించాడు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం మాయమైన విషయాన్ని గ్రహించిన ఇంటి యజమాని అజయ్ హరినాథ్ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

డ్రైవర్‌పై అనుమానాలు...




డ్రైవర్ తహసీన్ జీవనశైలిలో మార్పు రావడంతో ఇదే విషయాన్ని బాధిత యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. డ్రైవర్ నివాసం ఉంటున్నది కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధి కావడంతో బోయిన్‌పల్లి, కార్ఖానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. తహసీన్ గురించి ఆరా తీశారు. ఇటీవలే నాలుగు ఇన్నోవాలు కొనుగోలు చేసి ట్రావెల్స్ ప్రారంభించడం, రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడం, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు తదితర వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. పోలీసుల విచారణలో తానే విడతల వారీగా యజమాని ఇంట్లో చోరీకి పాల్పడినట్టు తహసీన్ అంగీకరించాడు.



స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు...



నిందితుడు తహసీన్ నుంచి రూ.12.70 లక్షల నగదు, ఇటీవలే కొనుగోలు చేసిన నాలుగు ఇన్నోవాలు, రెండు ద్విచక్ర వాహనాలు,  2,300 గ్రాముల బంగారం బిస్కెట్లు, 15 తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, మూడు ఖరీదైన సెల్‌ఫోన్లు, ఖరీదైన రిస్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు.



ఆరుగురిపై కేసు నమోదు



తహసిన్ దొంగిలించిన బంగారాన్ని తన సోదరుడు మహ్మద్ మోసిన్ (23)కు అందించేవాడు. ఆభరణాలను విక్రయించేందుకు అదే ప్రాంతానికి చెందిన వీరి మిత్రుడు హేక్ మహ్మద్ అస్లాముల్లా (23)ను సహాయాన్ని  తీసుకున్నారు. మోండా మార్కెట్ ప్రాంతంలోని నేమీచంద్‌జైన్, అక్షయ్‌చంద్‌జైన్ అనే వ్యాపారులకు విక్రయించారు. తహసీన్‌కు అదే ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఖదీర్ (25) సహకరించినట్టు పోలీసులు తేల్చారు. ఈ మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాచ్‌మన్ ఖదీర్ పరారీలో ఉండగా మిగతా ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు మిస్టరీని ఛేదించి పెద్దమొత్తంలో రికవరీ చేసిన కార్ఖానా డీఐ వై.నాగేశ్వర్‌రావు, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్లు సుధీర్, లక్ష్మణ్‌రావు బృందాన్ని డీసీపీ సుధీర్‌బాబు, అదనపు డీసీపీ వై.గిరి, ఏసీపీ గణేష్‌రెడ్డి అభినందించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top