అందుబాటులోకి ‘సెంటర్‌ లొకేటర్‌ యాప్‌’

అందుబాటులోకి ‘సెంటర్‌ లొకేటర్‌ యాప్‌’


విద్యార్థుల కోసం రూపొందించిన ఇంటర్‌ బోర్డు

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌కు అవకాశం

ప్రారంభించిన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య




సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు రూపొందించిన టీఎస్‌బీఐఈ ఎగ్జామ్‌ సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. మార్చి 1 నుంచి జరిగే ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని వెతుక్కునేందుకు ఇబ్బంది పడకుండా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా తమ పరీక్షా కేంద్రాన్ని తెలుసుకునేలా ఈ యాప్‌ను రూపొందించింది. సోమవా రం సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య ఈ యాప్‌ను ప్రారంభించారు. ఇంటర్‌ బోర్డు అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌ను విద్యార్థులు ఉపయోగించుకో వాలని ఆమె సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని వెతుక్కోవడంలో గందరగో ళానికి గురయ్యే పరిస్థితి ఉన్నందున, ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.



యాప్‌ సేవలు ఎలా పొందాలంటే..

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ కలిగిన విద్యార్థులు ప్లేస్టోర్‌ లోకి వెళ్లి టీఎస్‌బీఐఈ ఎగ్జామ్‌ సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో విద్యార్థి తన హాల్‌టికెట్‌ నంబర్‌ కంపోజ్‌ చేసి సెర్చ్‌ చేస్తే ఎగ్జామ్‌ సెంటర్‌ కోడ్, విద్యార్థి పేరు, సెంటర్‌ చిరునామా వస్తాయి. పరీక్షా కేంద్రానికి సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌ అందులో ప్రత్యక్షమవుతుంది. విద్యార్థి తను ఉన్న ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది? పరీక్షా కేంద్రాన్ని చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది? పరీక్షా కేంద్రానికి ఏ రూట్‌లో వెళ్లాలన్నది అందులో చూపిస్తుంది. పరీక్షా కేంద్రం ఫొటోలు కూడా అందులో ఉంటాయి. తద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించడంతోపాటు త్వరగా అక్కడికి చేరుకునే అవకాశం విద్యార్థులకు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,291 పరీక్షా కేంద్రాలకు సంబంధించిన మ్యాప్‌లను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ యాప్‌ ఉపయోగించాలంటే సదరు ఫోన్‌కు ఇంటర్నెట్‌ సదుపాయం అవసరం అవుతుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top