హెడ్ కానిస్టేబుల్‌పై ఏసీబీ కేసు?

హెడ్ కానిస్టేబుల్‌పై ఏసీబీ కేసు? - Sakshi


వ్యభిచారం కేసులో లంచం డిమాండ్

పరారీలో నిందితుడు


 

గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై ఏసీబీ కేసు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. వ్యభిచార  కేంద్రంపై దాడి చేసి అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తిని వదిలేసి డబ్బు డిమాండ్ చేయడంతో కేసు నమోదైనట్లు తెలిసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో నిందితులను రాత్రి సమయంలో కస్టడీలో పెట్టుకోవద్దని గత వారం సైబరాబాద్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  గచ్చిబౌలి ఠాణా పరిధిలో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందిందని క్రైం విభాగంలో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఇన్‌స్పెక్టర్  దృష్టికి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో దాడి చేసి నిందితులను కస్టడీలో పెట్టుకోలేమని, పగటిపూట దాడి చేయాలని ఇన్‌స్పెక్టర్ సూచించాడు.  ఇన్‌స్పెక్టర్ సూచనలను బేఖాతర్ చేస్తూ అదే రోజు రాత్రి ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్‌ను తీసుకొని వ్యభిచార కేంద్రంపై దాడిచేశారు. అక్కడ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.



బేరం కుదుర్చుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు తీసుకురాకుండా అతడి కారు తమ వద్ద ఉంచుకొని నిందితుడిని వదిలివేశారు. ఈ సెటిల్‌మెంట్‌లో సదరు హెడ్ కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసుల తీరు తనను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నారని భావించిన ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. మరుసటి రోజే అతను హెడ్‌కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి సిటీకి వస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని చెప్పాడు. తాను డ్యూటీలో బిజీగా ఉన్నానని, రావడం కుదరదని చెప్పి సదరు హెడ్ కానిస్టేబుల్ పీఎస్ పక్కన్నే ఉన్న పాన్ షాపులో డబ్బు ఇస్తే కలెక్ట్ చేసుకుంటానని అన్నాడు. అతను చెప్పిన విధంగా కారు యజమాని పాన్ షాపులో డబ్బు ఇవ్వగా.. కొద్దిసేపటికి హెడ్‌కానిస్టేబుల్ డబ్బు కలెక్ట్ చేసుకునేందుకు వేరే వ్యక్తిని పంపాడు.  అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను హెడ్ కానిస్టేబుల్ కాదని తేలింది. దీంతో ఏసీబీ అధికారులు పాన్ షాపు నిర్వాహకుడితో పాటు, డబ్బు కోసం వచ్చిన వ్యక్తిని మరింత లోతుగా విచారించారు.



విషయం బయటకు పొక్కడంతో సదరు హెడ్ కానిస్టేబుల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు అతని ఇంటికి వెళ్లి గాలించినా ఆచూకీ తెలియరాలేదు. గత నాలుగు రోజులుగా ఆ హెడ్ కానిస్టేబుల్ పోలీస్‌స్టేషన్‌కు రాకపోవడంతో ఏసీబీ అధికారులు అతడి ఇంటిపైన, బంధువుల ఇళ్లపైన నిఘా పెట్టారు. అంతేకాకుండా అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా, ఆ హెడ్‌కానిస్టేబుల్ పట్టుబడితే ఎవరి పేర్లు చెప్తాడోనని గచ్చిబౌలి పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఓ  వ్యభిచార కేంద్రంపై దాడి చేయగా నిర్వాహకుడి వద్ద ఓ ఎస్‌ఐ భారీ మొత్తంలో డబ్బు దండుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top