మరణంలోనూ వీడని స్నేహబంధం

మరణంలోనూ వీడని స్నేహబంధం - Sakshi


- యాక్సిడెంట్‌తో కళ్ల ముందే స్నేహితుడి మృతి

- తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న తోటి స్నేహితుడు

 

 హైదరాబాద్: వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. బాల్యంలోనే స్నేహం వారిని బందీ చేసింది.. ఒకే ఊళ్లో వాగులు, వంకలు, చెట్లు పుట్టలు.. అన్నీ తామై తిరిగారు.. చేతిలో చెయ్యేసి ఆడి పాడారు..! పెరిగి పెద్దయ్యారు.. ఆ చేతులు ఇప్పుడూ విడిపోలేదు!! విధి విడదీయాలని చూసింది. కానీ మృత్యువును సైతం కావలించుకొని చనిపోయిన తన స్నేహితుడిని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు మరో స్నేహితుడు. కళ్లముందే మిత్రుడి మరణాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తూ రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు! అందరినీ కలచివేసిన ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా కారంపూడి మండలం వేపగాంపల్లికి చెందిన మల్లయ్య కుమారుడు ఘంటా హరికృష్ణ (27), అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి రమేశ్ (25) చిన్నతనం నుంచి స్నేహితులు. టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న హరికృష్ణ ఇటీవలే మలేసియా నుంచి వచ్చి ఆరు నెలలుగా కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్ సమీపంలోని వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు.



ఆయన చిన్ననాటి స్నేహితుడు రమేశ్ కూడా ఇదే హాస్టల్‌లో ఉంటూ.. నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ హాస్టల్‌లో ఒకే రూమ్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి పని మీద బయటకు వెళ్లిన వారిద్దరూ బైక్ (ఏపీ 20ఏపీ 6824)పై అమీర్‌పేట్ వైపు నుంచి తిరిగి హాస్టల్‌కు వెళ్తున్నారు. అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో మూసాపేట్ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి ఓ గుర్తుతెలియని లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెనుక కూర్చొన్న హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న రమేశ్ హెల్మెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత నిర్జీవంగా పడి ఉన్న స్నేహితుడిని ఎంత లేపినా లేవలేదు. దీంతో రమేశ్.. బైక్‌ను అక్కడే వదిలేసి బోరున విలపిస్తూ భరత్‌నగర్ రైల్వేస్టేషన్ వైపు వెళ్లాడు. అర్ధరాత్రి కావడం.. ఎవరూ లేకపోవడంతో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు రమేశ్ సెల్‌ఫోన్ ఆధారంగా అందులో నెంబర్‌కు ఫోన్ చేసి బంధువులకు సమాచారం ఇచ్చారు. హరికృష్ణ మృతదేహాన్ని గాంధీకి, రమేశ్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top