ఓ తండ్రి ప్రేమ!

ఓ తండ్రి ప్రేమ!


బిడ్డ కోసం రికార్డుల వేట

నిమిషంలో 62 గుంజీలు

రెండేళ్ల కుమారుడితో మరో సాహసం

సైకిల్ వెనక్కి తొక్కించిన వైనం


 

సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని గుజరాతీ ఉన్నతి పాఠశాల ఈ కృత్యానికి శనివారం వేదికైంది. నగరంలోని మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అమీర్ కె వడ్‌సరియా.... అతని రెండున్నరేళ్లకుమారుడు మేహుల్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం వినూత్న ప్రయోగం చేశారు. అమీర్ ఒక నిమిషంలో 62 గుంజీలు తీశాడు. మేహుల్ ఒక నిమిషంలో 50 మీటర్ల వరకు ట్రైసైకిల్‌ను రీవర్స్‌లో(వెనక్కి) తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో అమీర్ గంట వ్యవధిలో ఉన్న 1100 గుంజీల రికార్డును... 1450 గుంజీలు తీసి బద్దలుకొట్టారు. శనివారం ఒక నిమిషంలో 62 గుంజీలు తీసి మరో రికార్డు నెలకొల్పారు.

 

చికిత్స కోసమే....




గుజరాత్‌కు చెందిన అమీర్ ఎనిమిదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని...భార్యా పిల్లలతో నగరానికి వచ్చాడు. మల్కాజిగిరి ప్రాంతంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ చాలీచాలని డబ్బులతో బతుకుబండిని లాగిస్తున్నాడు. అయిదేళ్లుగా పెద్ద కుమారుడు ఆమన్(8) కండరాల క్షీణత వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రో)తో బాధ పడుతున్నాడు. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. చికిత్స చేయించడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించ లేదు. కొడుకు కోసమే గుంజీలు తీయడం ప్రారంభించానని... ఈ రికార్డు నెలకొల్పడం ద్వారా వచ్చే డబ్బుతో బిడ్డకు వైద్య సేవలు అందించవచ్చని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అమీర్ పేర్కొన్నాడు. తన చిన్న కుమారుడు మేహుల్ తోనూ ట్రై సైకిల్ రివర్స్‌లో తొక్కించడం ప్రారంభించానన్నాడు. వీటిని వీడియో తీసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు పంపిస్తానని తెలిపాడు. ఈ రూపంలో డబ్బు సమకూరితే బిడ్డ వైద్య సేవలకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు చెప్పాడు. బిడ్డ కోసం తండ్రి...అన్న కోసం చిన్నారి చేసిన ఈ ప్రయోగాలు చూపరులను ఆకట్టుకోవడంతో పాటు...కదిలించాయి.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top