నో..పోలీస్‌..!

నో..పోలీస్‌..! - Sakshi


4323 వాహనాలకు ఒక కానిస్టేబుల్‌!

∙ హోంగార్డులనూ కలుపుకుంటే 1888 వాహనాలకు ఒకరు

∙ ట్రాఫిక్‌ విభాగంలో తీవ్రంగా మానవ వనరుల కొరత

∙ 20 ఏళ్ల క్రితం నాటి కేటాయింపులే కొనసాగింపు

∙ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో కాస్తా ఉపశమనం




సిటీబ్యూరో: రెండు దశాబ్ధాల క్రితం నగరంలో వాహనాల సంఖ్య పది లక్షల లోపే... అప్పట్లో ట్రాఫిక్‌ విభాగానికి కేటాయించిన సిబ్బంది 1795.



∙ 2017 మే నాటికి సిటీలో వాహనాల సంఖ్య 50 లక్షలు దాటింది... దీనికి తగ్గట్టు సిబ్బంది పెరగాల్సి ఉండగా... ఆ పోస్టుల్లోనూ 625 ఖాళీగా ఉన్నాయి.



∙పోలీసు సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్‌ విభాగానికి 2090 హోంగార్డు పోస్టులు కేటాయించారు. వీటిలోనూ 582 ఖాళీగానే ఉండటం గమనార్హం.



∙కేవలం పోలీసుల సంఖ్య పరంగా చూస్తే నగరంలో ప్రతి 4323 వాహనాలకు ఒక ట్రాఫిక్‌ పోలీసు ఉండగా,. హోంగార్డులను కలుపుకుంటే ప్రతి  1888 వాహనాలకు ఒకరు చొప్పున అందుబాటులో ఉన్నారు.  



నగర ట్రాఫిక్‌ విభాగంలో మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. చాలీచాలని సిబ్బం దితో నెట్టుకొస్తున్న అధికారులు అవస్థలు పడుతున్నారు. పోలీసు పోస్టులకు బదులు హోంగార్డులను వినియోగించుకుంటున్నారు. ఈ పోస్టుల్లోనూ వందల సంఖ్య లో ఖాళీగా ఉండటంతో దిక్కుతోచడం లేదు. ట్రాఫిక్‌ సిబ్బంది విషయం లో ఇతర మెట్రోలతో పోలిస్తే నగరం పరిస్థితి దారుణంగా ఉంది. 2017 మే నాటికి నగరంలో వాహనాల సంఖ్య 50,58,315 కాగా... అన్ని స్థాయిల్లోనూ ఉన్న ట్రాఫిక్‌ పోలీసుల సంఖ్య మాత్రం 1170 మాత్రమే. వీరికి అదనంగా మరో 1508 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో మానవవనరుల కొరతను కొంత వరకు అధిగమిస్తున్నారు.  



ఆ వాహనాలతోనే ఇబ్బంది...

రాజధాని రోడ్ల పైకి ఏటా లక్షకు పైగా కొత్త వాహనాలు వస్తున్నాయి. గత ఐదేళ్లుగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రజా రవాణా వ్యవస్థ అవసరమైన స్థాయిలో లేకపోవడంతో వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా రోడ్ల పైకి వస్తుండటంతో వీటి నియంత్రణపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. 2004లో ఈ వాహనాల సంఖ్య 13,99,532 కాగా, ఈ ఏడాది మే నాటికి 50,58,315 చేరింది. నగరంలోని వాహనాల్లో 80 శాతానికి పైగా వ్యక్తిగత వాహనాలే కావడం గమనార్హం.  



అనారోగ్య కోరల్లో సిబ్బంది...

ఢిల్లీ, ముంబయి తదితర నగరాలతో పోలిస్తే సిటీలో ట్రాఫిక్‌ సిబ్బంది సంఖ్య చాలా తక్కువ గా ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న సిబ్బందితోనే అధిక సమయం పని చేయించాల్సి వస్తోంది. ఈ కారణంగా ఫిఫ్ట్‌లు, వీక్లీ ఆఫ్‌లు పూర్తి స్థాయి లో అమలు కావడం లేదు. కాలుష్య కేంద్రాలుగా మారిన జంక్షన్లలో వేళా పాళా లేకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది రోగాల బారిన పడుతున్నారు. వాస్తవానికి సిబ్బంది గరిష్టంగా మూడు, కనిష్టంగా రెండు షిఫ్ట్‌ల్లో పని చేయాల్సి ఉంది. అయితే నగరంలో సిబ్బంది కొరత కారణంగా వారిపైనే అధిక భారం పడి నిర్విరామంగా పని చేయాల్సి వస్తోంది. ఇతర పోలీసుల మాదిరి ట్రాఫిక్‌ విభాగంలో పని చేస్తున్న వారికి విధుల మధ్యలో విరామం లభించదు. డ్యూటీకి వచ్చింది మొదలు పూర్తయ్యే వరకు నిలబడి ఉండాల్సిందే. రద్దీ వేళల్లో వీరి బాధలు వర్ణనాతీతం. ప్రస్తుతం ట్రాఫిక్‌ విభాగంలో పని చేస్తున్న వారితో అనేక మంది శ్వాసకోశ, చెవి, ముక్కు, గొంతు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు.  



హోంగార్డులే అత్యధికం...

ప్రస్తుతం నగర ట్రాఫిక్‌ విభాగంలో మొత్తం 2678 మంది సిబ్బంది అందుబాటులో ఉండగా... వీరిలో 1508 మంది హోంగార్డులే ఉన్నా రు. సిటీలో మొత్తం 525 ట్రాఫిక్‌ పాయింట్లు ఉండగా, వీటిలో కేవలం 310 చోట్ల మాత్రమే ట్రాఫిక్‌ సిబ్బంది ఉంటున్నారు. దాదాపు 50కు పైగా జంక్షన్లను హోంగార్డులే పర్యవేక్షిస్తున్నారు. హోంగార్డు ఉద్యోగం పర్మినెంట్‌ పోస్టింగ్‌ కాకపోవడంతో వీరికి ఎలాంటి అధికారాలు ఉండవు. చాలీచాలని జీతం కారణంగా వీరిలో అనేక  మంది అనధికారికంగా గైర్హాజరవుతున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్‌ విభాగంలో ఉన్న హోంగార్డుల్లో దాదాపు 300 మంది వరకు నిత్యం విధులకు దూరంగానే ఉంటున్నారు.  



టెక్నాలజీతో ఊరట  

నగర ట్రాఫిక్‌ విభాగం గత రెండున్నరేళ్ళలో వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పాట్‌ చలాన్లకు బదులు పూర్తి స్థాయిలో ఈ–చలాన్లు అమలు చేస్తూ నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ప్రాధాన్యం కల్పించింది. హెచ్‌–ట్రిమ్స్‌ వంటి పథకాలతో సిగ్నల్స్‌ ఉన్న జంక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా అభివృద్ధి చెందుతున్న ఐటీఎంఎస్, అమలు చేస్తున్న కాప్‌ లెస్‌ జంక్షన్స్‌ విధానాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఇవన్నీ సిబ్బంది కొరతతో ఉన్న ట్రాఫిక్‌ విభాగానికి ఊరటనిస్తున్నాయి. మరోపక్క పోలీసు విభాగం 9 వేలకు పైగా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తోంది. ఈ సిబ్బంది నుంచీ సింహభాగం నరానికి వస్తారని, వారిలో అవసరమైన సంఖ్యలో ట్రాఫిక్‌ వింగ్‌కు కేటాయించవచ్చనే ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top