720 మార్కులకు జేఈఈ పరీక్ష!

720 మార్కులకు జేఈఈ పరీక్ష! - Sakshi


♦ మూడు గంటల చొప్పున రెండు విభాగాలుగా ఆరు గంటల పాటు పరీక్ష

♦ జేఈఈ మెయిన్ నిపుణుల కమిటీ సిఫారసు

 

 సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2017 నుంచి వీటన్నింటికీ ఒకే పరీక్షను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా 720 మార్కులకు ప్రవేశ పరీక్షను నిర్వహించాలని జేఈఈ మెయిన్ నిపుణుల కమిటీ (సీఈపీ) సిఫారసు చేసింది. మూడు గంటల చొప్పున సమయం ఉండేలా 360 మార్కులను 2 పార్టులుగా మొత్తం ఆరు గంటల పాటు పరీక్ష నిర్వహించాలని సూచించింది. అందులో వచ్చే మార్కుల ఆధారంగా 40 వేల మందికిపైగా అభ్యర్థులకు ఆలిండియా ర్యాంకులను కేటాయించాలని... వాటి ఆధారంగానే ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలు చేపట్టాలని ప్రతిపాదించింది.



 వెయిటేజీలన్నీ రద్దు!

 ప్రస్తుతం 360 మార్కులకు జేఈఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం వెయిటేజీ, విద్యార్థి ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి... నార్మలైజ్ చేసి ఆలిండియా ర్యాంకులను ఖరారు చేస్తున్నారు. ఈ విధానం 2016-17 విద్యా సంవత్సరంలో మాత్రమే అమల్లో ఉండనుంది. ఇక 2017-18 నుంచి వెయిటేజీ, నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని రూర్కీ ఐఐటీ  డెరైక్టర్, నిపుణుల కమిటీ అధ్యక్షుడు అశోక్ మిశ్రా కేంద్రానికి సిఫారసు చేశారు. అంతేకాదు ఈ పరీక్ష నిర్వహణ, ప్రవేశాలు చేపట్టేందుకు నేషనల్ అథారిటీ ఫర్ టెస్టింగ్ (ఎన్‌ఏటీ- న్యాట్)ను ఏర్పాటు చేయాలని సూచించారు. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ అంటూ వేర్వేరు పరీక్షలు కాకుండా న్యాట్ పేరుతో ఒకే పరీక్ష ఆధారంగా ర్యాంకులిచ్చి ప్రవేశాలు చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశముందని జేఈఈ వర్గాలు వెల్లడించాయి.



 వికలాంగులకు ఒక్క మార్కు వచ్చినా అడ్వాన్స్‌డ్‌కు అర్హులే!

 ప్రస్తుత (2016-17) విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్ ఫలితాల్లో టాప్ 2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కటాఫ్ మార్కులను ఇటీవల సీబీఎస్‌ఈ ప్రకటించింది. జనరల్ అభ్యర్థులకు 100 మార్కులు, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌కు 70 మార్కులు, ఎస్సీలకు 52 మార్కులు, ఎస్టీలకు 48 మార్కులు కటాఫ్‌గా పేర్కొంది. ఈ నిర్ణీత మార్కులకంటే ఎక్కువ వచ్చినవారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. తాజాగా మంగళవారం వికలాంగుల కటాఫ్ మార్కును గౌహతి ఐఐటీ వెల్లడించింది. వికలాంగులు జేఈఈ మెయిన్‌లో ఒక్క మార్కు సాధించినా అడ్వాన్స్‌డ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top