56,046 ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ

56,046 ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ - Sakshi

- 7,347 మందికి లభించని సీట్లు

వచ్చే నెల 15 తర్వాత చివరి దశ కౌన్సెలింగ్‌!

 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 56,046 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఎంసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రవేశాల కమిటీ బుధవారం సీట్లను కేటాయించింది. రాష్ట్రంలోని 197 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 70 శాతం కన్వీనర్‌ కోటాలో 64,300 సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో మొదటి దశ కౌన్సెలింగ్‌లో 56,046 మంది విద్యార్థులకు సీట్లు లభించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మరో 8,254 సీట్లు మిగిలిపోయినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్‌లో 1,06,058 మంది విద్యార్థులు అర్హత సాధించినా సర్టిఫికెట్ల వెరిఫికే షన్‌కు కేవలం 64,402 మంది మాత్రమే హాజరయ్యారు. అందులో 63,588 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలో 7,347 మంది విద్యార్థులకు సీట్లు లభించ లేదు. ఇక ఇంజనీరింగ్‌పాటు బీ ఫార్మసీ, ఫార్మ్‌–డీ కలుపుకుంటే మొత్తంగా 309 కాలేజీల్లో 67,698 సీట్లు ఉండగా, 56,241 సీట్లు భర్తీ అయ్యాయి. 11,457 సీట్లు మిగిలిపోయాయి. 

 

91 కాలేజీల్లో వంద శాతం భర్తీ

రాష్ట్రంలో 309 ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్‌–డీ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు చర్యలు చేపట్టగా.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 91 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. 22 బ్రాంచీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. 9 బ్రాంచీల్లోనే సీట్లు మిగిలి పోయాయి. ఈసారి ఒక్క విద్యార్థి చేరని కాలేజీ ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. 12 కాలేజీల్లో 50 మంది లోపే చేరగా, మరో నాలుగు కాలేజీల్లో 10 మంది లోపు చేరారు.

 

త్వరలో ప్రవేశాల కమిటీ భేటీ

మిగిలిన సీట్లలో ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్‌ను వచ్చే నెలలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తర్వాతే రాష్ట్రంలో ఎంసెట్‌ ప్రవేశాల చివరి దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఐఐటీ, ఎన్‌ఐటీల ఆరో దశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు జూలై 29న ముగియనుంది. అంతవరకు కాకపోయినా వచ్చేనెల 15 తర్వాతే చివరి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఐదు దశల కౌన్సెలింగ్‌లో జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లు లభించని వారు రాష్ట్ర విద్యా సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రవేశాల కమిటీ సమావేశమై ఇంజనీరింగ్‌ తరగతుల ప్రారంభ తేదీతోపాటు చివరి దశ కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top