తెలంగాణ జనాభా 3.61 కోట్లు!

తెలంగాణ జనాభా 3.61 కోట్లు! - Sakshi


* సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడి  కుటుంబాల సంఖ్య 1,05,82,000

జిరాక్స్ ఫార్మాట్‌లపై మరో నాలుగు లక్షల కుటుంబాల వివరాలు

వీటిని పక్కన పెట్టిన అధికారులు.. విచారణ తరువాత చేర్చే అవకాశం

వారిని కూడా కలిపితే.. 3.73 కోట్లకు జనాభా

మరో ఆరు లక్షల ఇళ్లకు తాళాలున్నట్లు సర్వేలో నమోదు

హైదరాబాద్‌లో సర్వే జరగని కుటుంబాలు లక్షన్నర పైనే!

76 శాతం మందికి మాత్రమే ఆధార్‌కార్డుతో అనుసంధానం


 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా 3.61 కోట్లుగా తేలింది. మొత్తం కుటుంబాల సంఖ్య కోటీ 5 లక్షల 82 వేలుగా వెల్లడైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సమగ్ర ఇంటింటి సర్వే’లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యా యి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందించేందుకు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘సమగ్ర కుటుంబ సర్వే’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో సేకరించే సమాచారం ఆధారంగా ఒక స్పష్టమైన డాటాబేస్ ప్రభుత్వ శాఖలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

 

కుటుంబాలను సర్వే చేసి, సర్వే పత్రాలను జిల్లాల్లోనూ, హైదరాబాద్‌లోనూ యుద్ధ ప్రతిపాదికన కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం దాదాపు 23 వేల కంప్యూటర్లను వినియోగించగా.. కంప్యూటరీకరణ పూర్తికావడానికి 20 రోజులు పట్టింది. ఈ సమాచారంలో నుంచి అవసరమైన వివరాలను తీసుకోవడానికి వీలుగా ఒక సాఫ్ట్‌వేర్‌ను కూడా తయారు చేశా రు. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1.05 కోట్ల కు పైగా ఉండడంతో.. జనాభా నాలుగు కోట్లు దాటుతుందని తొలుత అంచనా వేసినా... జనాభా 3.61 కోట్లుగా వెల్లడైనట్లు తెలుస్తోంది.

 

ఇంకా తేలాల్సి ఉంది!

సర్వే వివరాలను నమోదు చేసిన తరువాత దాదాపు ఆరు లక్షల ఇళ్లకు తాళాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఆరు లక్షల ఇళ్లల్లోని కుటుంబ సభ్యులు వలస వెళ్లారా? లేక సర్వే కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లారా? ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సర్వే కోసం కోటీ ఇరవై లక్షల వరకు పత్రాలను సిద్ధం చేసినా... పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల కుటుంబాల వివరాలను జిరాక్స్ కాపీలపై నమోదు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై అధికార యంత్రాంగం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగు లక్షల కుటుంబాల వివరాలను కూడా కలుపుకొంటే.. జనాభా 3.73 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. కాగా 2011 జనాభా లెక్కల్లో తేలినట్లుగానే.. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం ఉన్నట్లు అధికారవర్గాలు వివరించాయి.

 

2.74 కోట్ల మందికి ఆధార్..

తెలంగాణ జనాభా 3.61 కోట్లు కాగా.. అందులో ఆధార్‌కార్డు ఉన్న వారి సంఖ్య 2.74 కోట్లుగా తేలింది. దాదాపు మరో 90 లక్షల మందికి ఆధార్‌కార్డు లేదు. వీరందరికీ ఆధార్‌కార్డులు ఎలా ఇస్తారన్న విషయంలోనూ ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. సర్వే సమయంలో మాత్రం ఆధార్‌కార్డు లేని వారికోసం మండల కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తామని.. వాటిద్వారా ఆధార్‌కార్డు అందగానే ఆ నంబర్‌ను సర్వే వివరాలకు అనుసంధానం చేస్తామని అధికారులు చెప్పారు.

 

రాజధానిలో పూర్తికాని సర్వే..

రాజధాని హైదరాబాద్‌లో దాదాపు లక్షన్నర కుటుంబాల సర్వే ఇప్పటికీ పూర్తికాలేదు. సర్వే చేయని కుటుంబాలపై ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో అధికారులు చెప్పినా.. ఆ తరువాత దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలూ రాలేదు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top