7 కాదు.. 14శాతం వడ్డీ!

7 కాదు.. 14శాతం వడ్డీ! - Sakshi


* గడువు తీరినా చెల్లించని వ్యవసాయ రుణాలపై వసూలు తప్పదు

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎస్‌ఎల్‌బీసీ స్పష్టీకరణ

* 14 శాతం వడ్డీ వసూలు చేయొద్దన్న రాష్ట్ర సర్కారు వినతికి తిరస్కరణ

* జూలై నుంచి రుణ బకాయిలపై 14 శాతం వడ్డీని రైతులు కట్టుకోవాల్సిందే


 

సాక్షి, హైదరాబాద్: గడువు తీరినా తిరిగి చెల్లించని వ్యవసాయ రుణాలపై రైతుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయకతప్పదని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం గడిచిన నాలుగు నెలలుగా వివిధ ఆంక్షలు విధిస్తూ జాప్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు సకాలంలో రుణాలు చెల్లించనందున.. వారికి వడ్డీ లేని రుణాల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏడు శాతానికి బదులు ఏకంగా 14 శాతం వడ్డీ భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

రైతుల వ్యవసాయ రుణాలపై 14 శాతం వడ్డీ వసూలు చేయరాదని, 7 శాతం వడ్డీకే పరిమితం కావలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్‌ఎల్‌బీసీకి లేఖ రాసింది. దీనిపై ఎస్‌ఎల్‌బీసీ స్పందిస్తూ.. ఏడు శాతం వడ్డీకి పరిమితం చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. తక్కువ వడ్డీ వసూలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అమలు చేయడం సాధ్యం కాదని, ఆర్‌బీఐ నుంచి మార్గదర్శకాలు రావలసి ఉంటుందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీని గత డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలకు, అప్పటి వరకు అయ్యే వడ్డీకి మాత్రమే వర్తింప చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ జనవరి నుంచి జూన్ వరకు రైతుల రుణాలపై ఏడు శాతం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే జూలై 1 నుంచి రైతుల వ్యవసాయ రుణాల బకాయిలపై 14 శాతం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించారు.

 

ఎప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయదో, లేదా ఎప్పటి వరకు రైతులు రుణాలను చెల్లించరో అప్పటి వరకు 14 శాతం మేర వడ్డీ వసూలు చేయక తప్పదని బ్యాంకర్లు స్పష్టంచేస్తున్నారు. గడువులోగా చెల్లించని రుణాలకు రాష్ట్ర ప్రభుత్వ వడ్డీ లేని రుణాల పథకం ఎలా వర్తించదో.. ఆర్‌బీఐ కూడా గడువు మీరిన రుణ బకాయిలపై 14 శాతం వడ్డీ వసూలుకు అనుమతించిందని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. రైతులపై ఏకంగా 14 శాతం వడ్డీ భారం పడటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు చెందిన రుణంలో ఒక్క రూపాయి మాఫీ చేయలేదని, రైతులు మాత్రం మాఫీ వస్తుందనే ఆశతో రుణాలను చెల్లించడం లేదని, దీంతో వడ్డీ భారం పెరుగుతోందని వారు చెప్తున్నారు.

 

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతుకు ఎంత రుణం మాఫీ చేస్తారో చెప్పి మిగతా రుణాన్ని రైతులు చెల్లించుకోవాలని చెప్తే అదనపు వడ్డీ భారం నుంచి రైతు గట్టెక్కుతారని, లేదంటే రైతులు వడ్డీల భారం మోయకతప్పదని వివరిస్తున్నారు. మహిళా సంఘాలదీ అదే పరిస్థితి: డ్వాక్రా సంఘాల పరిస్థితి దారుణంగా తయారైంది. వీటి కి రుణాల వాయిదాలను ప్రతి నెలా 15లోగా చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రుణ మాఫీ చేయడం లేదని స్పష్టంగా చెప్పకపోవడంతో.. ఆ సంఘాలు మాఫీ అవుతాయన్న ఆశతో ఎదురుచూస్తున్నాయని వారు చెప్తున్నారు. రుణ మాఫీ చేస్తారని మహిళా సంఘాలు వాయిదాలను చెల్లించడం లేదని.. దాంతో వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు కోల్పోయాయని వివరిం చారు. ఫలితంగా గడువు తీరిన మహిళా సంఘాల రుణాలపై బ్యాంకులు 14 శాతం వడ్డీ వసూలు చేయనున్నాయని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top