‘సంక్షేమ’ దరఖాస్తులు 14 లక్షలు


* అర్హులకే ఆహార భద్రత కార్డుల జారీ

* ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల

* కలెక్టర్ ఎం.కె.మీనా వెల్లడి


సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ నెల 13 నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన ‘సంక్షేమ’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 14 లక్షల మంది దరఖాస్తులు అందచేశారని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను తహసీల్దార్‌లకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫించన్‌ల కోసం దాదాపు లక్షా 35 వేల దరఖాస్తులు, ఇతరత్రా నాలుగు లక్షల 40 వేల దరఖాస్తులు అందాయన్నారు.



ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఫ్రొఫెషనల్స్, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన వారు, వ్యాపారులు, ప్రభుత్వ ఫించన్‌దారులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఫోర్ వీలర్, ఏసీ కలిగిన వారు, నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ గదులు కలిగిన ఇంటి యజమానులు, ఆదాయ పన్ను కట్టేవారు ఆహార భద్రతకార్డు పొందేందుకు అనర్హులని పేర్కొన్నారు. మూడు గదుల్లో నివసించే/స్వంత ఇల్లు కలిగిన వారు, రెగ్యులర్ ఆదాయం లేని వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన వారు, ఇంట్లో మంచినీటి, మరుగుదొడ్డి సదుపాయం లేని వారు, వితంతువుల వంటి అంశాలను ఆహార భద్రత కార్డు మంజూరీకి పరిగణలోకి తీసుకోవచ్చన్నారు.



ఆయా ప్రయోజనాల మంజూరీకి నిర్దేశించిన ప్రమాణాలను పరిశీలించేటప్పుడు క్షేత్రస్థాయి బృందాలు అనర్హులు లబ్ది పొందకుండా, అదే క్రమంలో అర్హులకు అన్యాయం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్‌లకు సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ రేషనింగ్ అధికారి పద్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్, జిల్లా ప్రణాళిక అధికారి బలరామ్, ఆర్డీవోలు నిఖిల, రఘురామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top