1,330 వైద్య ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా

1,330 వైద్య ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా


సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 1,330 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో 630 ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులున్నాయి. 300 ఏఎన్‌ఎం, 300 ఫార్మసిస్టులు సహా మరో 100 పోస్టుల్లో ఫిజియోథెరఫిస్టులు, స్టాఫ్ నర్సులు, సైకాలజిస్టులు తదితర ఉద్యోగాలున్నాయి.



ఈ పోస్టులన్నింటినీ జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ద్వారా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. వచ్చే వారంలో జిల్లాల్లో నోటిఫికేషన్ జారీచేసి నెల రోజుల్లోపు భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తారు.

 

మొబైల్ హెల్త్ టీముల కోసం...

0 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్‌ఎన్‌సీ)ను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో క్లస్టర్ కింద రెండు మొబైల్ హెల్త్ టీమ్ లు ఉంటాయి. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 300 మొబైల్ హెల్త్ టీంలు సేవలు అందిస్తాయి. ఒక్కో టీమ్‌లో ఒక మహిళా డాక్టర్, ఒక పురుష డాక్టర్, ఒక ఏఎన్‌ఎం, ఒక ఫార్మసిస్టు ఉంటారు. మొత్తంగా ఈ మొబైల్ టీమ్‌ల కోసమే 1,200 మందిని నియమిస్తారు. పిల్లలకు వైద్యం చేయడానికి జిల్లాకొక డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)ను ఏర్పాటు చేస్తారు.



ఆయా కేంద్రాల్లో ఒక పిల్లల వైద్య నిపుణుడు, ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్, ఒక డెంటల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఆ ప్రకారం 10 జిల్లాల్లో 30 మంది వైద్యులను డీఈఐసీ కేంద్రాల్లో నియమిస్తారు. వీటితోపాటు డీఈఐసీల్లో ఒక స్టాఫ్ నర్సు, ఒక ఫిజియోథెరఫిస్టు, ఆడియాలజిస్టు అండ్ స్పీచ్ థెరపిస్టు, సైకాలజిస్టు, ఆప్తమెట్రిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పెషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డీఈఐసీ మేనేజర్ పోస్టులున్నాయి. అన్ని జిల్లాల్లోని కేంద్రాల్లో కలిపి 130 మందిని నియమిస్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top